ఎన్నికల తర్వాత వైసీపీలో తొలివేటు !

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాజయం పాలయింది.  సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడ్డ నెల రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తొలి వేటు వేసింది.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణం అయ్యాడని సస్పెన్షన్ వేటు వేసింది. కదిరి శాసనసభ స్థానం నుండి పీవీ సిద్దారెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పై 27 వేల మెజారిటీతో విజయం సాధించాడు. అయితే ఈ ఎన్నికల్లో సిద్దారెడ్డికి వైసీపీ టికెట్ నిరాకరించింది.

ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బీఎస్ మక్బూల్ ను బరిలోకి దించింది. సిద్దారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కేవలం 6265 ఓట్ల అత్యల్ప మెజారిటీతో విజయం సాధించాడు. ఈ మేరకు సిద్దారెడ్డి టీడీపీకి అనుకూలంగా పనిచేశాడని ఫిర్యాదులు రావడంతో వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల్లోనూ కదిరి స్థానం నుండి వైసీపీ అభ్యర్థి అత్తర్ చాంద్ బాషా టీడీపీ అభ్యర్థి కందికుంటను ఓడించడం గమనార్హం.