కేటీఆర్‌కు సోమిరెడ్డి అదిరిపోయే కౌంట‌ర్‌

తెలంగాణ- ఆంధ్రా రాజ‌కీయాల్లో ఇటీవ‌ల ప‌రిణామాలు సామాన్యుల దృష్టిని సైతం ఆక‌ర్షిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌హ‌జంగానే ఇంత‌టి కీల‌క‌మైన ప‌రిణామాల‌పై రాజ‌కీయ నాయ‌కుల విమ‌ర్శ‌లు- ప్ర‌తి విమ‌ర్శ‌ల్లో భాగ‌మ‌వుతుంటాయి. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేయ‌గా, దానికి టీడీపీ నేత‌, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. గ‌తం నుంచి మొద‌లుకొని ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కూ కేటీఆర్ గురించి స్పందించారు.

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింద‌ని, పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినప్ప‌టికీ ఫ‌లితాలు వ్య‌తిరేకంగా వ‌చ్చాయ‌ని విశ్లేషించారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంతంగా పోటీ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని విశ్లేషించారు. జ‌గ‌న్ ఓడిపోయిన‌ప్పటికీ, 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు ఉపయోగపడితే మంచిదే కదా అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సోమిరెడ్డి ఘాటుగా స్పందించారు.

బీఆర్ఎస్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారంటూ సోమిరెడ్డి విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాళ్ల కింద పడేసి తొక్కినా, సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా కేటీఆర్ లో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉందని సోమిరెడ్డి సెటైర్ వేశారు. టీఆర్ఎస్ నేత‌లు త‌మ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించిన‌ట్లు చెప్ప‌డం చూస్తుంటే.. వారి కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుందని సోమిరెడ్డి మండిప‌డ్డారు. బీఆర్ఎస్ నేత‌లు త‌మ‌ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారని… జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారని విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి పొగ‌రు వ్యక్తుల‌కు ముందుగానే గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.

త‌మ నాయకుడు చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు… కేటీఆర్ వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే బీఆర్ఎస్‌ కొంప ముంచిందని గుర్తుంచుకోవాల‌ని సోమిరెడ్డి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల‌ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి స‌మావేశాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ అంశాల ప‌రిష్కారానికి వేసిన ముంద‌డుగు సమావేశంగా చూడాలని సోమిరెడ్డి వెల్ల‌డించారు.