నామినేటెడ్ పోస్టుల‌కు నేత‌ల క్యూ: బాబుకు బిగ్‌ టాస్క్‌

ఏపీలో ప‌ద‌వుల కోసం నాయ‌కులు క్యూ క‌ట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సీట్లు త్యాగం చేసిన‌వారు. సీట్లు ద‌క్క‌ని వారు, పార్టీల కోసం ప‌నులు చేసిన వారు.. ఇప్పుడు ప‌దవుల కోసం వెంట‌ప‌డుతున్నారు. దీంతో నామినేటెడ్‌పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ సీఎం చంద్ర‌బాబుకు బిగ్ టాస్క్‌గా మారింది. తాజాగా ఈ విష‌యంపై చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌కు స‌మాచారం ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ ప‌ద‌వుల లిస్టును ఆయ‌న ఇప్ప‌టికే సేక‌రించారు.

వీటితోపాటు సొసైటీ, ప్రత్యేక సంస్థ‌ల్లో ఉన్న పోస్టుల వివరాలను కూడా తెలుసుకున్నారు. వీటిని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేస్తే.. ఇక పాల‌న‌పై తాను పూర్తిస్థాయిలో దృష్టిలో పెట్టేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వు తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ ప‌ద‌వులు అందిపుచ్చుకునేందుకు కూట‌మిలోని జ‌న‌సేన పార్టీ కూడా ఉవ్విళ్లూరుతోంది. మెజారిటీ నాయ‌కులు క్యూ క‌డుతున్నారు. ఇటీవల రెండు ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఖాళీ అయితే.. ఒక‌టి జ‌న‌సేన తీసుకున్న విష‌యం తెలిసిందే. అలానే ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వులు కూడా.. పంచుకునేందుకు జ‌న‌సేన సిద్ధ‌మైంది.

దీంతో ఉన్న అన్ని ప‌ద‌వుల్లోనూ.. 20-30 శాతం ప‌ద‌వుల‌ను జ‌న‌సేన‌కు ఇచ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌ద‌వులు గ‌మ‌నిస్తే.. వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో 25 చైర్మన్ పోస్టులు జనసేన కోరినట్లు తెలిసింది. వీటిలో మ‌రికొన్నింటిని బీజేపీ పంచుకునే అవ‌కాశం ఉంది. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే టీడీపీలో ఉన్న ఆశావహులను గుర్తించేందుకు క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. వారి అభిప్రాయాల‌ను తీసుకుని, పార్టీ ప‌రంగా నాయ‌కులు చేసిన కృషి, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాయ‌కులు చూపిన ప్ర‌తిభ వంటివాటిని దృష్టిలో ఉంచుకునే ప‌ద‌వులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అలా చూసుకున్నా.. నాయ‌కుల సంఖ్య ప‌ద‌వుల కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీంతో ఎవ‌రిని సంతృప్తి ప‌ర‌చాల‌నే విష‌యంపై చ‌ద్ర‌బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. చివ‌రకు ఏం తేలుస్తారో చూడాలి.