సిక్కోలు పిలుస్తోంది !

అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు అవసరం ఉన్నా, లేకున్నా ప్రతిపక్ష పార్టీ మీద తొడగొట్టారు. ప్రభుత్వ అధికారుల మీద పెత్తనం చెలాయించారు. తీరా ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కరిద్దరు నేతలు తప్ప మిగిలిన వారు ఎవరూ కార్యకర్తల వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తమను వాడుకున్న నేతలు ఇప్పుడు మొకం చూపకపోవడంతో కార్యకర్తలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

సిక్కోలుగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టిన వైసీపీ 10 స్థానాలకు గాను 8 స్థానాలలో విజయం సాధించింది. దీంతో వైసీపీ ఇక్కడి నేతలకు పదవులు ఇచ్చి పెద్ద పీట వేసింది. తమ్మినేని సీతారం స్పీకర్ గా, ధర్మాన కృష్ణదాస్‌ ఉప ముఖ్యమంత్రిగా, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మంత్రిగా, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల నుండి దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు.

ఇన్ని పదవులు ఇఛ్చి ఇంత ప్రోత్సాహం అందించినా ఈ ఎన్నికల్లో జిల్లాలోని పదికి పది నియోజకవర్గాలలో వైసీపీ భూస్థాపితం అయింది. టీడీపీ ఘన విజయం సాధించింది. ఎన్నికల తర్వాత గతంలో చేసిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం తమ మీద కేసులు పెట్టడం, విచారణ జరపడం ఖాయం అన్న భయంతో నేతలు బయటకు రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న నేతలు ఇప్పుడు తమకు ఎవరు అండగా ఉంటారో అన్న భయంతో ఉండగా, నాయకుల పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి ఏమిటి ? అని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.

1981 నుండి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ధర్మాన ప్రసాదరావు ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గోండు శంకర్ చేతిలో 52521 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆయన బయటకు రావడం లేదు. ఆయన సోదరుడు క్రిష్ణదాస్, మాజీ సీది అప్పలరాజు మాత్రం అడపాదడపా కార్యకర్తలకు అభయం ఇస్తున్నారు. తమ్మినేని నెల రోజులుగా మొహం చాటేశారు. ప్రభుత్వంలో దూకుడుగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నుండి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయాక పట్టించుకోవడం లేదు. ఎచ్చెర్ల, పాతపట్నం మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, శాంతి, రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, ఇచ్చాపురం నుండి పోటీ చేసి విజయల ఆచూకీ తెలియడంలేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఒక్కసారి బయటకు వచ్చి భరోసా నివ్వాలని వేడుకుంటున్నారు.