2029లో ఏపీ సీఎం ష‌ర్మిలే: రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2029లో జ‌రిగే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ష‌ర్మిల ముఖ్య‌మంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని చెప్పారు. ఆమె పోరాట ప‌టిమ ఎలా ఉంటుందో.. ప్ర‌చార స‌త్తా ఎలా ఉంటుందో.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు తెలిసింద‌న్నారు. నాయ‌కుల‌ను క‌లుపుకొనిపోవ‌డం, కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్తేజ ప‌ర‌చ‌డంలోనూ ష‌ర్మిల విజ‌యం సాధించార‌ని తెలిపారు. వ‌చ్చే నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను ష‌ర్మిల విజ‌యవంతంగా నిర్వ‌హించ‌నున్నార‌ని తెలిపారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 75వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని గుంటూరు జిల్లాలోని మంగ‌ళగిరిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో కూడిన ప్ర‌సంగంతో కాంగ్రెస్ నాయ‌కుల‌ను ఉత్తేజ ప‌రిచారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ష‌ర్మిల అనుకున్న‌ది సాధించార‌ని తెలిపారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో ఆమె ఉత్సాహంగా ముందుకు సాగిన‌ట్టు వివ‌రించారు. కార్యకర్తల త్యాగం, షర్మిల పోరాటం ఊరికే పోదని, 2029లో పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని రేవంత్ చెప్పారు. అటు కేంద్రంలోనూ 2029లో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ప్రజల పక్షాన పోరాడబోయేది షర్మిల మాత్రమేన‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. వైఎస్‌ పేరుతో వ్యాపారం చేసేవాళ్లు వారసులు కాదంటూ.. ప‌రోక్షంగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి రేవంత్ విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ త‌ర‌ఫున నిర్వ‌హించే ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని.. ష‌ర్మిల‌కు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. ప్రజల కోసం పోరాడేవాళ్లే వైఎస్‌ వారసులు అంటూ.. వైఎస్ వార‌స‌త్వాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే.. ఒకే ఒక్క సంద‌ర్భంలో త‌ప్ప‌.. జ‌గ‌న్ పేరు ఎక్క‌డా రేవంత్ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. రేవంత్ రాక‌తో.. వైఎస్ జ‌యంతి కార్య‌క్రమం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.