ప‌వ‌న్ మంత్రి అయ్యాడు.. రిక్షా- ఆటో అయింది.. ఏంటా క‌థ‌!!

అభిమానుల ఉత్సాహం ఒక్కొక్క‌రిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు గుర్రం ఎక్కాల‌ని చాలా మంది పార్టీల‌కు అతీతంగా కోరుకున్నారు. కొంద‌రు దేవుళ్ల‌కు కూడా మొక్కుకున్నారు. మ‌రికొంద‌రు మ‌రో రూపంలో ఆయ‌న గెల‌వాల‌ని కోరుకున్నారు. మొత్తానికి 70 వేల ఓట్ల మెజారిటీతో ప‌వ‌న్ గెలిచారు. ఈ క్ర‌మంలో తూర్పుగోదావ‌రికి చెందిన‌ ఓ యువ‌తి.. ఏకంగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యానికి మోకాళ్ల‌పై మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్న విష‌యం తెలిసిందే.

అలానే.. ‘పిఠాపురంలో ప‌వ‌న్ గెలిస్తే..’ అంటూ ఓ అత్యంత సామాన్య‌మైన రిక్షా కార్మికుడి కుటుంబం కూడా ఆక్షాంచింది. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓ రిక్షా కార్మికుడి భార్య‌.. ప‌వ‌న్ పై అభిమానంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓ కీల‌క వ్యాఖ్య చేసింది. “మా ప‌వ‌న్ గెలిస్తే.. మా ఆయ‌న రిక్షా తొక్కి తెచ్చిన సొమ్ముతో ఊరంతా పండ‌గ చేస్తా” అంటూ త‌న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేసింది. ఈ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో ప‌వ‌న్ వ‌ర‌కు చేరాయి. ఒక సంద‌ర్భంలో ఆయ‌న “ప్ర‌జ‌లు న‌న్ను చాలా బ‌లంగా కోరుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు.

అన్న‌ట్టుగా.. ప‌లువురు ఆకాంక్షించిన‌ట్టుగానే ప‌వ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో రిక్షా కార్మికుడి భార్య మ‌రియ‌మ్మ‌.. ఒక‌రోజు రిక్షా తొక్క‌గా వ‌చ్చిన డ‌బ్బుల‌తో స్వీట్లు కొని చుట్టుప‌క్క‌ల వారికి పంచి పెట్టింది. ఈ విష‌యంలో మ‌రోసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తెలిసింది. దీంతో చ‌లించిపోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆ కుటుంబానికి ‘స్పెషల్ గిఫ్ట్’ అందించాల‌ని పార్టీ నాయ‌కుల‌ను ఆదేశించారు. అంతే.. ఇంకేముంది.. జ‌న‌సైనికులు క‌దిలారు. ఆ కుటుంబానికి ఏ ప‌దో ప‌ర‌కో ఇస్తే ప్ర‌యోజ‌నం లేద‌నుకున్నారు. వెంట‌నే రిక్షా కాస్తా.. ఆటో అయిపోయింది!

నిరుపేద కుటుంబానికి జీవనోపాధి మెరుగుపరిచేలా స‌రికొత్త‌ ఆటోను జ‌న‌సేన నాయ‌కులు అందించారు. దీనిపై మరియమ్మ, ఆమె భర్త హర్షం వ్యక్తం చేస్తూ.. క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. త‌మ జీవితాల్లో వెలుగు వ‌చ్చిందంటూ మరియమ్మ సంతోషం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. త‌న భర్త 20 ఏళ్లుగా రిక్షా తొక్కుతున్న‌ట్టు ఆమె తెలిపారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆటో అందించడంతో త‌మకు మ‌రింత ప్రోత్సాహ‌క‌రంగా ఉంటుంద‌ని మ‌రియ‌మ్మ అన్నారు. జనసేన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.