ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లటం.. కేంద్రమంత్రుల్ని కలిసేందుకు.. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేందుకు అని చెప్పేటప్పుడు సీఎం వెంట ఎవరెవరు వెళతారు? అన్నది చాలా ప్రాధమికమైన అంశంగా చెప్పొచ్చు. వీలైనంత వరకు ముఖ్యమంత్రి.. ఆయన వెంట కీలకమైన అధికారులు కొందరు వెళుతుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఎంపీలు కలుస్తారు. అవసరమనుకుంటే.. వారిని కూడా తీసుకొని కేంద్రమంత్రితో భేటీ అవుతుంటారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
ఎప్పుడూ లేని రీతిలో తాజాగా సీఎం జగన్ తన ఢిల్లీ టూర్ కు తనతో పాటుగా తీసుకెళ్లిన వారి బ్యాక్ గ్రౌండ్ ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ లేని రీతిలో సీఎం జగన్ ఈసారి తన వెంటనే పలువురు లాయర్లను వెంట పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఏముంది? అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. తాజాగా సీఎం జగన్ వెంట ఢిల్లీకి వెళ్లిన వారిలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం.. న్యాయవాది భూషణ్ లు వెళ్లారు. ఇంతకీ ఈ న్యాయవాది భూషణ్ మరెవరో కాదు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ కుమారుడు.
వీరితో పాటు.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. సీఎం సేఫీ అధికారులు ప్రవీణ్ ప్రకాశ్.. కృష్ణ మోహన్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలు కూడా ఢిల్లీ వెళ్లారు. కేంద్రమంత్రి షాతో భేటీ సందర్భంగా సీఎం జగన్ తో పాటు.. ఎంపీ బాలశౌరి.. ప్రవీణ్ ప్రకాశ్.. ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డి మాత్రమే కారులో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. షా తో భేటీ సందర్భంగా మాత్రం జగన్ ఒక్కరే లోపలకు వెళ్లినట్లుగా చెబుతున్నారు.