కేసీఆర్ అర్థం చేసుకున్న భారతదేశం !

థర్డ్ ఫ్రంట్… భారతదేశ రాజకీయాల్లో అపరిపక్వమైన కల. ఇప్పటికే ఈ దిశగా ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నం విజయవంతం కాలేదు. కాంగ్రెస్ గానీ, బీజేపీ గాని లేకుండా మరో ఫ్రంట్ ఇంతవరకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. కర్ణుడి చావుకి శతకోటి కారణాలు అన్నట్టుంది ఈ వ్యవహారం. ఎన్నిసార్లు విఫలం అయినా… ఈ థర్డ్ ఫ్రంట్ పై ఎవరికీ ఆశ చావలేదు.

అయితే జాతీయ రాజకీయాల్లో తాజాగా కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇంతకాలం థర్డ్ ఫ్రంట్ కి ఆధారం, బలం… కమ్యూనిస్టులు అని అన్ని పార్టీలు నమ్మాయి. ఎందుకంటే ఎవరు థర్డ్ ఫ్రంట్ అన్నా కూడా వారికి కమ్యూనిస్టులు మద్దతు పలుకుతు వచ్చారు. పైగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్న వారు కూడా కమ్యూనిస్టులనే నమ్ముకుంటారు. దీనికి కారణం లేకపోలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాత దేశంలో అతి ఎక్కువమందికి పరిచయం ఉన్న పార్టీ, అతి ఎక్కువ రాష్ట్రాల్లో యాక్టివ్ గా ఉన్న పార్టీ కమ్యూనిస్టు పార్టీయే. దీంతో వారి అండ ఉంటే… దేశమంతటా ఉన్న వారి ఓట్లు కూడా కూడితే థర్డ్ ఫ్రంట్ సక్సెస్ అవుతుందని ఇంతకాలం అందరూ నమ్మారు.

అయితే కమ్యూనిస్టులు క్రమంగా ప్రభావం కోల్పోతూ వచ్చారు. వారి స్థాయి, బలం బలహీనపడుతూ వచ్చింది. ఆధునిక ప్రపంచానికి కమ్యూనిస్టులు నచ్చడం లేదు. సరికదా… అనేక మంది కమ్యూనిస్టు లీడర్లు పార్టీలు మారడం విశేషం.

తాజాగా కేసీఆర్ మూడో ఫ్రంట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈసారి కూడా కమ్యూనిస్టులు థర్డ్ ప్రంట్ కు జై కొట్టారు. కేసీఆర్ వెంట నడుస్తామన్నారు. అయితే, కేసీఆర్ ని మిగతా నాయకుల్లా అంచనా వేయడం అంత కరెక్టు కాదు. వీరందరు అనుకుంటున్నది వేరు కేసీఆర్ అనుకుంటున్నది వేరు.

థర్డ్ ఫ్రంట్ విషయంలో కేసీఆర్ గతానికి భిన్నంగా పోతున్నారు. కమ్యూనిస్టుల మద్దతు అయితే కేసీఆర్ తీసుకుంటున్నారు కానీ కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న థర్డ్ ఫ్రంట్ కు మూలస్తంభం ముస్లింలు. అవును కేసీఆర్ జాతీయ స్థాయిలో ముస్లిం పవర్ ని గుర్తించారు. బహుశా ఈ థర్డ్ ఫ్రంట్ దేశానికి ఉపయోగపడుతుందో లేదో తెలియదు గాని కేసీఆర్ కి ఉపయోగపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ కి కావాల్సింది అదే.

కేసీఆర్ లెక్కేంటి?

బీజేపీ ఎపుడైతే మతతత్వ కోణంలో బలంగా ఎదిగిందో కాంగ్రెస్ మెల్లగా తన లౌకికవాద గొంతును సవరించుకుంది. అదే మ్యాజిక్ తో మోడీ రెండోసారి గెలవడంతో కాంగ్రెస్ బెంబేలెత్తిపోయింది. చివరకు మేమే బాబ్రీమసీదు కూలగొట్టింది. అందుకే అయోధ్య కల ఇపుడు సాధ్యమైంది అనాలని కాంగ్రెస్ నోటిదాకా వచ్చింది. మోడీకి మించి భక్తి ప్రపత్తులు చాటుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేయడంతో ముస్లింలు కాంగ్రెస్ ని వదిలేశారు. దేశంలో ముస్లింలు ఇపుడు మరో అండ కోసం చూస్తున్న సమయంలో గత పదేళ్లు వేర్వేరు రాష్ట్రాలకు చాపకింద నీరులా పాకిన ఎంఐఎం (MIM) పార్టీ ని కేసీఆర్ పట్టేశారు.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 14 శాతం ముస్లింలున్నారు. ముస్లింల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇంత ముస్లిం జనాభా ఉన్న భారతదేశంలో చరిత్రలో మొదటి సారి 2014లో బీజేపీ ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకుండా హిందు మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అబ్బురం. బహుశా ఇది మళ్లీ జరుగుతుందో లేదో తెలియదు.

2019లో ఎన్నికయిన 17వ లోక్ సభలో అన్ని పార్టీల నుంచి మొత్తం ముస్లిం ఎంపీలు 27 మంది ఉన్నారు. 14వ లోక్ సభలో ముస్లిం ఎంపీల సంఖ్య 23. చరిత్రలో అత్యధికంగా 1980లో 49 మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు. దామాషా ప్రకారం ఆ జనాభా అంతా ఒకే చోట ఉన్నారని అనుకుంటే 76 మంది ఎన్నుకునేంత ముస్లిం జనాభా ఇండియాలో ఉంది. ప్రాక్టికల్ గా చూసినా దేశంలోని 543 నియోజకవర్గాల్లో 80 నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. దీనిని కేసీఆర్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే కేంద్రంలో అధికారంలోకి వస్తామా లేదా అన్నది పక్కన పెడితే… ఈ ముస్లిం జనాభాను సరిగ్గా క్యాచ్ చేస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ ఆలోచన.

అసదుద్దీన్ తో కలిపి కొత్త పార్టీ పెడితే ఎంత లేదన్నా ముస్లిం జనాభా మరియు తెలుగు జనాభా, లౌకిక వాద జనాభా అండతో… దేశ వ్యాప్తంగా 50 మంది ఎంపీలను గెలిపించుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. తాను జాతీయ పార్టీ పెడితే ప్రభావం చూపగలిగిన తెలుగు రాష్ట్రాలకు ఇవి తోడైతే.. తాను పెట్టబోయే కొత్త పార్టీ ద్వారా కనీసం 60-80 సీట్లు గెలవగలం అని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. అదే జరిగితే కేసీఆర్ పార్టీ దేశంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ఇక కేసీఆర్ తో కలిసి వచ్చే పార్టీలు బాగా ప్రభావం చూపితే ఢిల్లీ పీఠాన్ని తాను నిర్దేశించవచ్చన్నది కేసీఆర్ అంచనా. ఏ పార్టీలు కలిసి రాకున్నా ముస్లింల అండతో తన చేతిలో 40 ఎంపీలున్నా తానే కింగ్ అన్నది కేసీఆర్ ప్లాన్.

దీనికి కేసీఆర్ కొన్ని విషయాలను బేస్ చేసుకున్నారు. ఒక ముస్లిం లీడర్ కంటే అందంగా ఉర్దూలో మాట్లాడ గలిగిన ఏకైక రాజకీయనాయకుడు కేసీఆరే. అతనికి ఎంఐఎం తోడైతే లౌకిక వాద పార్టీ గా అవతరించవచ్చన్నది కేసీఆర్ ఆలోచన. వీరిద్దరు గొప్ప వక్తలే. ఇక జాతీయ రాజకీయాలపై తనకున్న అవగాహన, మోడీపై మూడోసారి కచ్చితంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను కూడా కేసీఆర్ నమ్ముతున్నారు.

కొసమెరుపు … ప్రతి ప్లాన్ గీసేటపుడు అద్భుతంగా ఉంటుంది. కొన్ని అనుకున్నట్లు జరుగుతుంటాయి. కొన్నేమో జరగవు. అన్నీ అనుకున్నట్లు జరగడం అంత సులువు కాదు. మరి తాను గీసుకున్న ప్లాన్ ను అమలు చేయడంలో కేసీఆర్ ఎంత సమర్థంగా ముందుకు వెళ్తారో చూడాలి. రాబోయే కాలంలో పూర్తవబోయే అయోధ్య ఆలయం నుంచి వినిపించే జై శ్రీరామ్ నినాదం ముందు కేసీఆర్ లౌకిక వాదం నిలుస్తుందా? లేదా అభివృద్ధి అనే కొత్త అస్త్రం కాపాడుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.