అమరావతి రాజధానిని వైసీపీ అధినేత జగన్ అధ:పాతాళానికి తొక్కేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న ప్రజా రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానులు అంటూ జగన్ మూడు ముక్కలాట ఆడి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే జగన్ ను ప్రజలు గద్దె దించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. ఈ క్రమంలోనే అమరావతి అభివృద్ధికి నడుం బిగించిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం కరుడుగట్టిన తీవ్రవాదులు కూడా అమరావతికి ఆమోదం తెలుపుతారని, కానీ, జగన్ మాత్రం అమరావతి రాజధానిని నాశనం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ చెబుతున్నా సరే జగన్ మాత్రం కాదంటున్నారని విమర్శలు గుప్పించారు. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని గుర్తు చేశారు. గతంలో టీడీపీ హయంలో సైబరాబాద్ సృష్టించామని, వాస్తు ప్రకారం సైబరాబాద్ నిర్మాణం సరికాదని అంతా చెప్పినా భూమి అందుబాటులో ఉండటంతో అక్కడే ముందుకు వెళ్లామని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపింది సైబరాబాద్ అని చెప్పారు.
ప్రపంచంలో అత్యధిక భూమి సేకరించి ప్రాజెక్టు అమరావతి ఒక్కటేనని చంద్రబాబు అన్నారు. ప్రపంచ బ్యాంకు కూడా ఈ భూ సమీకరణ విధానాన్ని కేస్ స్టడీగా తీసుకుందని, భూములు ఇచ్చిన రైతులతో ఒప్పందాలను కుదుర్చుకునేలా చట్టాలు రూపొందించాలని చెప్పారు. పదేళ్లపాటు రైతులకు కౌలు ఇచ్చామని, దాంతోపాటు రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలలో రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. రైతు కూలీలకు కూడా అమరావతి రైతులతో పాటు పెన్షన్ ఇచ్చామని ఆయన అన్నారు.
స్వయం సమృద్ధి సాధించేలా, ఆదాయం పెరిగేలా అమరావతి రాజధానిని రూపొందించామని అన్నారు. అమరావతి రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శించారు.