ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా లడ్హా నియామకం

ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిబద్ధత గలిగిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఏపీకి వస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సీఎం చంద్రబాబు, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమర్థులైన అధికారుల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఐపీఎస్ అధికారి మహేశ్‌ చంద్ర లడ్హా నియమితులయ్యారు. లడ్హాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న లడ్హాను ఏపీకి కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు రిక్వెస్ట్ చేయడంతో లడ్హాను ఇక్కడకు పంపారు.

1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి లడ్హా గతంలో ఏపీలో పలు జిల్లాల్లో పలు హోదాల్లో బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించారు. రౌడీలు, మావోయిస్టులు, అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ట్రాక్ రికార్డు లడ్హాకు ఉంది. గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన లడ్హా మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్ ఈస్ట్‌ జోన్ డీసీపీగా, ఎన్ఐఏలో ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వర్తించారు.

విజయవాడ సిటీ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ పోలీస్ కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగా లడ్హా పని చేశారు. 2019-20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పని చేసి ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌ పై వెళ్లారు. సీఆర్పీఎఫ్‌లో ఐజీగా పనిచేస్తున్న లడ్హా ఏపీకి తిరిగొచ్చారు.

గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా లడ్హా పని చేస్తున్న సమయంలో లడ్హాపై మావోయిస్టులు దాడికి ప్రయత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని క్లెమోర్‌మైన్స్‌ పెట్టి పేల్చేశారు. కానీ, ఆ వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో లడ్హాతో పాటు ఆ వాహనంలో ఉన్న ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.