ఎంత అధికారం ఉన్నా.. ఎంత అంగబలం, అర్థబలం ఉన్నా.. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు.. నోరు జారేందుకు.. కాలు విసిరేందుకు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలి. లేకపోతే.. ఇలాంటి పరిస్థితే వస్తుంది. వైసీపీ కీలక నాయకుడు, జగన్ వ్యాపార భాగస్వామి.. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యవహారం.. తూర్పుగోదావరిలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
అధికారంలో ఉన్నప్పుడు.. తనకంటూ ఎదురులేదన్నట్టుగా ఆయన వ్యవహరించారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులపై దాడులు ప్రోత్సహించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక, కీలక నాయకుల స్థలాలు, ఇళ్లపైనా దాడులు చేసి.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరి ఇళ్లను కూల్చేశారనే వాదన కూడా అప్పట్లో తెరమీదికి వచ్చింది. ఇలాంటి ద్వారంపూడి.. అలా చెలరేగిన ద్వారం పూడికి ఇప్పుడు టైం రివర్స్ అయింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా ఆయన ఊహించనట్టుగా.. ఆ రోజు వచ్చేసింది.
ఒకప్పుడు.. తను పిలిస్తే.. క్యూకట్టిన పోలీసులు.. తన కారు డోర్ తీసిన పోలీసులు.. అధికారుల ముందే.. ఆయన చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చింది. అక్రమ కట్టడాల పేరుతో మునిసిపల్ అధికారులు.. ద్వారంపూడి అనుచరుడి ఇంటిని కూల్చే ప్రయత్నం చేశారు. ఇది కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఉంది. వాస్తవానికి.. సదరు అనుచరుడు బళ్లీ సూరిబాబు.. సుదీర్ఘకాలంగా ద్వారంపూడితో కలిసి ఉన్నారు. ఇలాంటి నాయకుడికి చెందిన ఇంటిని కూల్చేస్తుంటే.. ఊరుకోలేక పోయారు.
దీంతో తన అనుచరులతో కలిసి ద్వారం పూడి రంగంలోకి దిగారు. కానీ,ఒకప్పటి కాలం కాదు కదా..! ఎంత తెలిసిన అధికారులైనా.. ఎంత తనకు మిత్రులైన అధికారులు ఉన్నా.. రూల్స్ రూల్సే కదా.. ఇవే.. ద్వారంపూడికి చెక్ పెట్టాయి. పోలీసులను తోసుకుంటూ వెళ్లి.. నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకోవాలని ప్రయత్నించినా.. కుదరలేదు. దీంతో నిస్సహాయ స్థితిలో ద్వారంపూడి వెనుదిరిగారు. ఆ తర్వాత.. సదరు నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. మొత్తంగా నేర్చుకోవాల్సిన.. ఈ ఘటన నేర్పుతున్న పాఠం.. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని.. ఊహించకపోవడమే!
Gulte Telugu Telugu Political and Movie News Updates