రాజ‌ధానిపై వ్యూహం మార్చేద్దాం.. బాబు తాజా ప్లాన్‌!

రాజ‌ధాని విష‌యంపై వ్యూహం మార్చాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు టీడీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే అనేక రూపాల్లో యుద్ధం చేసిన బాబు.. ఒక‌ర‌కంగా అస్త్ర స‌న్యాసం చేసేశారు. మూడు రాజ‌ధానుల విష‌యంలో అమ‌రావ‌తి రైతుల‌ను, ప్ర‌జ‌లను, మ‌హిళ‌ల‌ను, యువ‌త‌ను కూడా ఆయ‌న ప్ర‌భావితం చేశారు. ఎక్క‌డెక్క‌డో ఉన్న వారిని కూడా ఏక‌తాటిపైకి తెచ్చారు. ప్ర‌భుత్వంపైనా.. మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పైనా బాబు వ్యూహాత్మ‌కంగా ఎదురుదాడి చేయించారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయాల్లో ఎన్న‌డూ జోలె ప‌ట్ట‌ని చంద్ర‌బాబు.. అది కూడా చేసేశారు.

అయితే, ఎన్ని చేసినా.. జ‌గ‌న్ కానీ, ఆయ‌న పార్టీ నేత‌లు కానీ.. ఈ మూడు రాజ‌ధానుల విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీంతో న్యాయ పోరాటం అన్నారు. అది కూడా సాధ్య‌మ‌వుతున్న ప‌రిస్తితి లేదు. కేంద్రం ముందు సాగిల‌ప‌డ్డారు. కేంద్ర‌మే ఆదుకోవాల‌న్నారు. మోడీ హ‌ఠావో అన్న నోటితోనే.. మోడీనే దేవుడు అన్నారు. ఆయ‌నే వ‌చ్చి అమ‌రావ‌తిని కాపాడుకోవాల‌న్నారు. అయినా.. వ‌ర్క‌వుట్ కాలేదు. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్ర‌మంలోనే ఇప్పుడు టీడీపీ అధినేత మ‌రోరూపంలో ఉద్య‌మించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అంటున్నారు టీడీపీ నాయకులు. వారి చూచాయ‌గా చెబుతున్న దానిని బ‌ట్టి.. త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు.. మ‌రోసారి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతున్నారు.

అదేస‌మ‌యంలో ఏ పార్టీ రాజ‌ధాని అంశంపై క‌లిసి వ‌స్తే.. ఆ పార్టీతో జ‌ట్టుకు కూడా వెనుకాడేది లేద‌నే సంకేతాలు పంపాల‌ని రెడీ అయ్యార‌ట‌. మ‌రీ ముఖ్యంగా బీజేపీతోనూ ఈ విషయంలో చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే తిరుప‌తి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వ‌స్తోంది. దీనిని అవ‌స‌ర‌మైతే.. బీజేపీకి ఇచ్చేసి .. తాను స‌హ‌క‌రించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. ఇక‌, సోష‌ల్ మీడియాలో మ‌రింత ఎక్కువ‌గా వార్త‌లు రాయించ‌డంతోపాటు.. రాజ‌ధాని అంశాన్ని జాతీయ స్తాయిలోనూ ఉద్య‌మించేలా ముందుకు న‌డిపించాల‌ని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ ఉద్య‌మాన్ని రెండు రూపాల్లో న‌డిపించాల‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి అవైనా స‌క్సెస్ అవుతాయా? చూడాలి. బాబు వ్యూహం ఏమ‌వుతుందో అంటున్నారు టీడీపీ నేత‌లు కొంద‌రు.