టీడీపీ సీనియర్ నాయకులు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని పార్టీ విజయం కోసం కష్టపడ్డ అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడికి తగిన గుర్తింపు ఇచ్చేలా సీఎం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. మంచి పదవులతో వీళ్లను గౌరవించాలని చూస్తున్నారు. దైవభక్తి మెండుగా ఉండి, ఆధ్యాత్మిక భావాలతో సాగుతున్న గజపతిరాజుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ పదవి కట్టబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీటీడీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే టీటీడీ ఛైర్మన్ పదవి కోసం కూడా తీవ్రమైన పోటీ ఉంది.
కానీ అన్ని రకాలుగా ఆ ఛైర్మన్ పదవికి గజపతిరాజు అర్హుడని బాబు భావిస్తున్నట్లు సమాచారం. సింహాచలం పుణ్యక్షేత్రంతో పాటు ఉత్తరాంధ్రలోని అనేక ఆలయాలకు గజపతిరాజు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే టీటీడీ ఛైర్మన్ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తే ఆ పదవి గౌరవంతో పాటు హుందాతనం కూడా పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అనుభవజ్ఞుడికి ఆ పదవి కట్టబెడితే వ్యవహారాలన్నింటికీ సమర్థంగా చక్కదిద్దుతారని అంటున్నారు. అలాగే గజపతిరాజుకు ఈ పదవి ఇస్తే ఎవరూ వ్యతిరేకించే పరిస్థితి ఉండదు.
మరోవైపు యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారడంతో ఆ పార్టీకి మోడీ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ నేతల్లో ఒకరిని గవర్నర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ పదవికి రామకృష్ణుడు అయితేనే కరెక్ట్‌గా ఉంటారని బాబు కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.