పెద్దిరెడ్డి ఆందోళ‌న ఎందుకు?

త‌న‌కు, త‌న కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని మాజీ మంత్రి, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి వేడుకున్నారు. గ‌త వైసీపీ హ‌యాంలో 4+4 భ‌ద్ర‌త ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి తాజాగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 1+1 చేసింది. ఇది నిబంధ‌న‌ల మేర‌కేన‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అయితే.. ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన త‌గ్గింప‌ని.. త‌మ‌కు గ‌ట్టి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పెద్దిరెడ్డి కుటుంబం కోరుతోంది.

ఈ మేర‌కు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా పిటిష‌న్లు వేశారు. త‌మ‌కు గ‌తంలో ఉన్న భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని.. కోరారు. ప్ర‌స్తుతం తాము విప‌క్షంలో ఉన్నామ‌ని.. త‌మ ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని పిటిష‌న్ ద్వారా కోర్టుకు విన్న‌వించారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. శుక్ర‌వారం ఇరుప‌క్షాల వాద‌న‌లు న‌మోదు చేసుకుంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాది.. గ‌త ప్ర‌భుత్వం పెద్దిరెడ్డి భ‌ద్ర‌త ను దృష్టిలో పెట్టుకుని 4+4 భ‌ద్ర‌త క‌ల్పించింద‌న్నారు.కానీ, ప్ర‌స్తుత ప్ర‌భుత్వం దీనిని 1+1కు కుదించింద‌ని తెలిపారు.

దీనివెనుక రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌ని తెలిపారు. గతంలో మంత్రిగా, ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబానికి రాజ‌కీయ విరోధులు ఎక్కువ‌గా ఉన్నార‌ని.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న భ‌ద్ర‌త‌ను తిరిగి 4+4గా ఉంచేలా ప్ర‌స్తుత ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరారు. ఇక‌, ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏజీ వాదన‌లు వినిపిస్తూ.. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలిపారు. దీని ప్ర‌కారం పెద్దిరెడ్డికి 1+1 భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాల‌పై రివిజ‌న్ ప్ర‌క్రియ ఆధారంగా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. ఈ వాద‌న‌లు న‌మోదు చేసుకున్న ధ‌ర్మాస‌నం.. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని స‌ర్కారును ఆదేశించింది. విచార‌ణ‌ను వాయిదా వేసుకుంది.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంద‌నేది ఆస‌క్తిగా మారింది. వైసీపీ హ‌యాంలో ఐదేళ్లు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి.. ప్ర‌తిప‌క్షాల‌ను అణిచేసే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అయ్యారు. పుంగ‌నూరు లో వైసీపీ జెండా త‌ప్ప‌.. మ‌రో జెండా క‌నిపించ‌కుండా.. అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీని అమ‌లు చేశార‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. కాద‌ని.. ఎవ‌రైనా ఇత‌ర పార్టీల జెండాలు ప‌ట్టుకుని క‌నిపిస్తే.. రాత్రికి రాత్రి స‌ద‌రు నేత‌, కార్య‌క‌ర్త ఇంటిపై పోలీసులు నేరుగా రంగ ప్ర‌వేశం చేసి.. గంజాయి, స‌హా దొంగ‌త‌నం కేసుల్లో ఇరికించార‌ని అప్ప‌ట్లో టీడీపీ నేత‌లు విమ‌ర్శించారు. ఇక‌, ఇప్పుడు స‌ర్కారు మార‌డంతో పెద్దిరెడ్డికి రాజ‌కీయంగా సెగ ప్రారంభ‌మైంది. దీంతో ఆయ‌న భ‌ద్ర‌త విష‌యంలో కొంత ఆందోళ‌న చెందుతున్నారు.