- నాడు వైఎస్ చేసిన తప్పే జగన్ చేశారు
- పోలవరంపై జగన్ అడుగడుగునా మాట మార్చారు
- జూన్-డిసెంబర్.. అంటూ ప్రాజెక్టును నాశనం చేశారు
- ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్
ఏపీ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టు పోలవరం. అయితే. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండడుగు లు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా.. దీనిని పూర్తి చేస్తామని చెబుతోంది . కానీ, చేతల్లో ఎక్కడో తేడా కొడుతోంది. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు.. గోలవరంగా మారిపోయింది. గత వైసీపీ సర్కారు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ, ఐదేళ్లలో కనీసం ప్రధాన పనులు ఏవీ చేయకుండానే కాలం హరించింది. అనేక వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల తీరు తెన్నులపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దీనిలో ముఖ్యాంఖాలు.. చంద్రబాబు చెప్పిన వాస్తవాలు ఇవీ..
- పోలవరం ప్రాజెక్టు ద్వారా 194 టీఎంసీల నీరు నిల్వ, వరద నీటితో కలిపి 322 టీఎంసీలను వినియోగించుకోవచ్చు. 7.2 లక్షల ఎకరాలకు సాగు, 28.50 లక్షల మందికి తాగునీరు ఇవ్వొచ్చు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజం అభివృద్ది చేయొచ్చు.
- ప్రాజెక్టు డయాఫ్రం వాల్ డెప్త్ 90 మీటర్లు. ఎత్తు 20 మీటర్లు, వెడల్పు 16 మీటర్ల ఎత్తయిన గేట్లు ఉంటాయి. 390 కిలోమీటర్ల పొడవైన కుడి, ఎడమ కాల్వలు ఉన్న అతి పెద్ద ప్రాజెక్టు.
- 2014-19 మధ్య 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపట్టారు. ఇది గిన్నీస్ రికార్డు సాధించింది.
- 2014 నుంచి ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టులో 72 శాతం పనులు పూర్తి చేశారు. రూ.11,762 కోట్లు ఖర్చు పెట్టగా డీపీఆర్-2 కింద రూ.55,548 కోట్ల వ్యయానికి టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది.
- జగన్ హయాంలో పోలవరం పనులు జరిగింది 4%
- జగన్ పాలనా కాలంలో ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది 4 వేల167 కోట్లు మాత్రంఏ.
- సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం రోజునే పోలవరంలో పనులు నిలిపివేశారు.
- 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది.
- కాఫర్ డ్యామ్ లో గ్యాప్ లు పూర్తి చేయకపోవడంతోనే డయాఫ్రం వాల్ దెబ్బతింది. దీనిని గుర్తించేందుకు రెండేళ్ల సమయం పట్టింది.
- 2019లో జగన్ అదికారంలోకి రాగానే కాంట్రాక్టర్ ను మార్చేశారు. దీంతో హెడ్ వర్క్స్ నిలిచాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దన్నా వినలేదు. కాంట్రాక్టర్లను మార్చవద్దని సూచించింది. అయినా జగన్ కాంట్రాక్టర్ ను మార్చారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన తప్పునే జగన్ కూడా చేశారు.
- డయాఫ్రం వాల్ నాశనం అయిపోయింది. దీనిని మరమ్మతు చేయాలంటే రూ.447 కోట్లు ఖర్చవుతుంది. కొత్త డయాఫ్రం వాల్ కట్టాలంటే రూ.990 కోట్లు కావాలి. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ సీపేజీ వల్ల డ్యామ్ పై ఏ పని చేయాలన్నా వీలు కావడంలేదు.
- పోలవరం నిర్వాసితులకు జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. టీడీపీ హయాంలో కట్టిన పునరావాస కాలనీల్లో మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేదు. టీడీపీ హయాంలో పునరావాసం కోసం రూ.4,114 కోట్లు ఖర్చు పెట్టారు.
- జగన్ హయాంలో పోలవరం బాధితుల పునరావాసం కోసం రూ.1,687 కోట్లు ఖర్చు చేసింది.
వైసీపీ అసమర్థత!
వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును పూర్తి చేయడంపైనా మోస పూరిత ప్రకటనలు చేశారని తెలిపారు. అధికారంలోకి రాగానే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు, ఆ తర్వాత డిసెంబర్ అన్నారు. అప్పటికీ చేయలేదని చంద్రబాబు చెప్పారు. ఇక, 2022 జూన్ నాటికి పోలవరం పూర్తవుతుందని చెప్పారు. తర్వాత మళ్లీ డిసెంబరు నాటికి అన్నారని అప్పుడు కూడా చేయలేదన్నారు. చివరగా అసలు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారని దుయ్యబట్టారు.