చంద్ర‌బాబు స‌ర్కారుకు జ‌గ‌న్ ఫ్రెండ్‌ యార్ల‌గ‌డ్డ స‌ర్టిఫికెట్‌!

ఏపీలో చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వానికి మాజీ సీఎం జ‌గ‌న్ స్నేహితుడు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ స‌ర్టిఫి కెట్ ఇచ్చారు. ‘మంచి నిర్ణ‌యం-శుభ‌ప‌రిణామం’ అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి.. చంద్ర‌బాబుతో విభేదించ‌డంలో యార్ల‌గ‌డ్డ ముందున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్‌తో క‌లిసి ప‌నిచేసిన యార్ల‌గ‌డ్డ .. అప్ప‌ట్లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా ప‌నిచేశారు. త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలోనూ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు.

త‌ర్వాత కాలంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పంచ‌న చేరిన యార్ల‌గ‌డ్డ‌.. చంద్ర‌బాబును విమ‌ర్శించే ప‌ని పెట్టుకున్నారు. అప్ప‌టి నుంచి యార్ల‌గ‌డ్డ‌కు.. చంద్ర‌బాబుకు మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి. ఇక‌, వైఎస్ హ‌యాంలోనే ఆయ‌న‌కు హిందీ జాతీయ భాషా సంఘం చైర్మ‌న్ ప‌ద‌వి కూడా ల‌భించింది. దీంతో మ‌రింత‌గా వైఎస్ కుటుంబానికి విధేయుడు అయ్యారు. ఆ త‌ర్వాత కాలంలో జ‌గ‌న్‌కు చేరువ‌య్యారు. 2019లో ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. తెలుగు భాషాసంఘానికి అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టారు.

అప్ప‌టి నుంచి జ‌గ‌న్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం, మూడు రాజ‌ధానుల‌ను కూడా స‌మ‌ర్థించ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో తెలుగుకు బ‌దులు ఇంగ్లీష్ మీడియంను ప్ర‌వేశ పెట్ట‌డం పెను వివాదానికి దారి తీసింది. తెలుగు భాషా సంఘం అధ్య‌క్షుడిగా.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని యార్ల‌గ‌డ్డ స‌మ‌ర్థించ‌లేక‌.. ఇబ్బంది ప‌డ్డారు. ప‌లు వైపుల నుంచి వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌తో ఆయ‌న ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌రోక్షంగా జ‌గ‌న్‌కు మిత్రుడిగానే మెలుగుతూ వ‌చ్చారు.

కాగా.. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్‌ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును గ‌తంలో జ‌గ‌న్‌.. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. అప్ప‌ట్లో టీడీపీ నాయ‌కులు స‌హా.. భాషాసంఘం ప్రేమికులు.. అన్న‌గారి అభిమానులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయినా.. జ‌గ‌న్ స‌ర్కారు ముందుకే వెళ్లింది. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నాలుగు రోజుల కింద‌ట నిర్వ‌హించిన కేబినెట్ భేటీలో హెల్త్ యూనివ‌ర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిని తాజాగా హ‌ర్షిస్తూ.. యార్ల‌గ‌డ్డ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. “మంచి నిర్ణ‌యం-శుభ‌ప‌రిణామం. ఏపీ ప్ర‌భుత్వం మంచి నిర్ణ‌యం తీసుకుంది” అంటూ యార్ల‌గ‌డ్డ వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం.