టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. మంగళగిరి నుంచి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. యువగళం మహిమో.. లేక తనలోని తపనో.. మొత్తానికి నారా లోకేష్.. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే.. ప్రతి రోజూ ఆయన ప్రజాదర్బార్ పేరుతో సమస్యలు, వినతులు తీసుకుంటున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ ప్రారంభించారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం మంగళగిరికి చెందిన ప్రజలు ఈ దర్బార్‌ను జోరుగా వినియోగించుకుని తమ సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో గత వైసీపీ పాలనలో కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు, మరికొన్ని వ్యక్తిగత సమస్యలు(వ్యాధులు, రోగాలు, ఇళ్ల పట్టాలకు చెందిన) చెప్పుకొని వాటి పరిష్కారంతో ఉపశమనం పొందుతున్నారు. దాదాపు ప్రతి రోజూ వేల మంది తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. అన్ని సమస్యలను ఓపిగా వింటున్న నారా లోకేష్.. వాటికి సంబంధించి పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. శని, ఆదివారాలు తప్ప.. మిగిలిన ఐదు రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజాదర్బార్ ఉంటోంది.
ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను కూడా వెల్లడిస్తున్నారు. ఈ పరిణామాలతో ఇప్పుడు మంగళగిరి వ్యాప్తంగా “సమస్య చెప్పుకొంటే పరిష్కారం అవుతుంద”న్న భరోసా కలుగుతోంది. ఈ పరిణామంతో నారా లోకేష్ గ్రాఫ్ పెరిగింది. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేగా గెలిచినా.. మంత్రి అయినా. తమకు ఏం చేస్తారు? అనుకున్న సాధారణ ప్రజలకు ఆయన ఇప్పుడు దివిటీగా మారారు. ప్రజాదర్బార్ వ్యవహారం కేబినెట్‌లోనూ చర్చకు వచ్చింది.
అయితే.. ఈ గ్రాఫ్ ను మరింత పెంచుకునేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వారానికి ఒక సారి తానే స్వయంగా ప్రజల వద్దకు వెళ్లేవారు. దీంతో ఆయనను ప్రజలు ఆదరించారు. ఇక, ఇప్పుడు నారా లోకేష్ తన నివాసాన్ని దర్బార్ చేసుకున్నారు. ఇది నారా లోకేష్‌కు ప్రజానేతగా గ్రాఫ్ ఇచ్చింది. దీనిని ఇప్పుడు కాపాడు కోవడంతోపాటు.. మున్ముందు మరింత పెంచుకునేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా నెలకు ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి. అదేసమయంలో మరింత సమయం వెచ్చించాలని కూడా.. స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates