ఆ వెయ్యి కోట్లు ఏమ‌య్యాయి? : ప‌వ‌న్ ఆరా!

వైసీపీ హ‌యాంలో ఏపీలో జ‌రిగిన నిధుల దుర్వినియోగంపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస స‌మీక్ష‌లు చేస్తున్నారు. ఇటీ వ‌ల పంచాయ‌తీ నిధుల విష‌యంపై ఆరా తీసిన ఆయ‌న ఏటా పంచాయ‌తీల‌కు కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల‌ను ఎలా ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుసుకున్నారు. దాదాపు 6 వేల కోట్ల‌రూపాయ‌ల‌కు పైగా నిధుల‌ను వైసీపీ స‌ర్కారు ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. పంచాయ‌తీల‌కు నిధులు ఎందుకు ఇవ్వ‌లేద‌ని కూడా నిల‌దీశారు. దీనికి పంచాయ‌తీ అధికారులు కొన్ని స‌మాధానాలు చెప్పారు. పంచాయ‌తీలు ఏళ్ల త‌ర‌బ‌డి విద్యుత్ బిల్లులు క‌ట్ట‌లేద‌ని.. దీంతో ఆ నిధుల‌ను మిన‌హాయించుకున్నార‌ని తెలిపారు.

ఈ స‌మాధానంపై సంతృప్తి చెంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పంచాయ‌తీ నిధుల విష‌యంపై త‌న‌కు స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌న మ‌రో వెయ్యి కోట్ల రూపాయ‌ల విష‌యాన్ని కూడా అధికారుల‌ను ప్ర‌శ్నించారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. 2014 నుంచి ‘స్వ‌చ్ఛ‌త’ పేరుతో న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల సుందరీక‌ర‌ణ‌కు నిధులు ఇస్తోంది. ఈ క్ర‌మంంలో 2019-24 మ‌ధ్య ఏపీకి స్వ‌చ్ఛాంధ్ర పేరుతో రూ.1000 కోట్ల‌కు పైగా నిధుల‌ను విడుద‌ల చేసింది. ఈ నిధుల‌తో ప‌నులు చేయాల్సి ఉంది. ఈ సొమ్ముల‌ను స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ కు ఇచ్చి.. దాని నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ప‌నులు చేయించాలి.

సుంద‌రీక‌ర‌ణ‌, మురుగునీటి నిర్వ‌హ‌ణ వంటి ప‌లు కార్య‌క్ర‌మాల‌కు ఈ నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం వెచ్చించాల్సి ఉంది. అయితే.. ఏపీ స‌ర్కారు ఈ నిధుల‌ను స్వ‌చ్ఛాంధ్ర‌కు కేటాయించ‌లేదు. తాజాగా ఈ కార్పొరేష‌న్ కార్య‌క‌లాపాల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. నిధులు ఏమ‌య్యాయంటూ.. అధికారుల‌ను నిల‌దీశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేష‌న్‌కు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. 2019 నుంచి కేంద్ర ప్ర‌భుత్వం వెయ్యి కోట్లకు పైగా ఇచ్చింద‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు వివ‌రించారు.

అయితే.. వీటిని త‌మ కార్పొరేష‌న్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ విడుద‌ల చేయ‌లేద‌న్నారు. దీంతో స‌ద‌రు నిధుల‌ను ఏం చేశార‌నేది త‌మ‌కు తెలియ‌ద‌ని వివ‌రించారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. “మీ కార్పొరేష‌న్‌కు వ‌చ్చిన నిధుల‌ను మీరు ఎందుకు అడిగి తీసుకోలేదు” అని ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానం లేని అధికారులు మౌనం వ‌హించారు. దీనిపై ఆర్థిక శాఖ వివ‌ర‌ణ తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని స‌ద‌రు అధికారుల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశించారు.