టీడీపీలో ప‌ద‌వులు ప్లీజ్‌: జిల్లాకు ఇద్ద‌రు చొప్పున వెయిటింగ్..!

కూట‌మి స‌ర్కారు కొలువు దీరింది. మంచి మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఎన్నిక‌ల స‌మయంలో సీట్లు ద‌క్క‌ని నాయ‌కులు, సీట్లు త్యాగం చేసిన నాయ‌కులు కూడా.. నామినేటెడ్ ప‌ద‌వుల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. హీనాతి హీనంగా వేసుకున్నా.. జిల్లాకు ఇద్ద‌రు చొప్పున ఇలాంటి వారు తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. క‌నీసంలో క‌నీసం.. ముగ్గురు నుంచి న‌లుగురు చొప్పున నాయ‌కులు జిల్లాల్లో ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు.

కృష్ణా: ఉమ్మ‌డి కృష్ణాజిల్లాను తీసుకుంటే.. మైల‌వ‌రం సీటును వ‌దులుకున్న దేవినేని ఉమా, మచిలీ ప‌ట్నం ఎంపీ సీటును వ‌దులుకున్న కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, గుడివాడ‌లో స‌హ‌క‌రించిన రావి వెంకటేశ్వ‌రావు, నూజివీడులో అన్నీతానై వ్య‌వ‌హ‌రించిన ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావులు కీల‌కంగా ఉన్నారు. ప‌ద‌వుల కోసం ఎదురుచూస్తున్నారు.

గుంటూరు: ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ప‌ద‌వుల కోసం వేచి ఉన్న‌వారి సంఖ్య చాలానే ఉంది. పెద‌కూర పాడు సీటును వ‌దులుకున్న కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌, వైసీపీ నుంచి వ‌చ్చి ఎన్నికల ‌స‌మ‌యంలో సేవ చేసిన‌.. జంగా కృష్ణ‌మూర్తి, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు, ఇక‌, తెనాలి సీటును త్యాగం చేసిన‌.. ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గుంటూరు వెస్ట్ సీటును త్యాగం చేసిన కీల‌క నాయ‌కుడు, అలానే స‌త్తెన‌ప‌ల్లి సీటును వ‌దులుకున్న కోడెల శివ‌రామ‌కృష్ణ వంటి అనేక మంది నాయ‌కులు కూడా.. బాబు నిర్ణ‌యం కోసం వేచి చూస్తున్నారు.

అనంత‌పురం: ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాకు వ‌స్తే.. ఇక్క‌డ కూడా కొంద‌రు సీట్ల‌ను త్యాగం చేశారు. వీరిలో అర్బ‌న్ టికెట్‌ను వ‌దులుకున్న వైకుంఠం ప్ర‌భాక‌ర చౌద‌రి, అనంత‌పురం ఎంపీ సీటును వ‌దులుకు న్న జేసీ ప‌వ‌న్ కుమార్, ధ‌ర్మ‌వ‌రం సీటును త్యాగం చేసిన‌.. ప‌రిటాల శ్రీరాం వంటివారు ఉన్నారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోనూ ఎన్నిక‌ల‌కు ముందు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. వేమిరెడ్డి దంప‌తుల కోసం.. టికెట్లు త్యాగం చేసిన వారిలో బీద ర‌విచంద్ర‌యాద‌వ్ వంటి వారు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వ‌దులుకొని మ‌రీ టీడీపీ కోసం సేవ చేశారు. ఇలా.. అన్ని జిల్లాల్లోనూ లెక్క‌కు మిక్కిలిగానే ఉన్నారు. దీంతో వీరంతా ప‌దవులు ప్లీజ్ అంటూఎదురు చూస్తున్నారు.