ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూటమి తరఫున శాసనసభాపక్ష నేతగా సీఎం చంద్రబాబు తొలిసారిగా సభలో ప్రసంగించారు. అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా శాసనసభలో మాట్లాడారు. తన తొలి స్పీచ్ లోనే తన మార్క్ పంచ్ డైలాగులు, కామెడీ తో పవన్ అదరగొట్టారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజల కోసం పోరాడుతూ ప్రతిపక్ష నేతలను తిడుతూ వాడి వేడి విమర్శలు చేసే అయ్యన్నపాత్రుడిని ప్రజలు ఇంతకాలం చూశారని, ఇకపై ఆయనకు ప్రతిపక్ష నేతలను తిట్టే అవకాశం ఆయనకు లేదని చమత్కరించారు.
సభలో సభ్యులు ఎవరైనా తిడుతుంటే స్పీకర్ గా ఆయనే నియంత్రించాల్సి ఉంటుందని పవన్ చమత్కరించడంతో సభలో నవ్వులు పూశాయి. అయ్యన్నపాత్రుడికి కోపం వస్తే ఋషికొండకు గుండు కొట్టినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారని ఇకపై ఆయనకు తిట్టే అవకాశం లేకపోవచ్చని పవన్ జోక్ చేశారు. ఇన్నాళ్లు మీలో ఆవేశాన్ని చూశారని, ఇకపై హుందాతనం చూస్తారని పవన్ చెప్పారు. వైసీపీ సభ్యులు సభలో లేకపోవడాన్ని పవన్ తప్పుబట్టారు. ఐదేళ్లు వ్యక్తిగత దూషణలకే పరిమితం కావడంతో వారిని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారని విమర్శించారు.
ఈరోజు సభలో ఉండే ధైర్యం వాళ్లకు లేదని, విజయాన్ని స్వీకరించిన అంతగా పరాజయాన్ని స్వీకరించలేకపోయారని పవన్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో శాసనసభలో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండేవని, బూతులు రాష్ట్రాభివృద్ధిని గత ప్రభుత్వం వెనక్కి నెట్టిందని విమర్శించారు. 2047 నాటికి ఏపీ ఉన్నతంగా ఉండాలంటే ఇప్పుడే పునాది వెయ్యాలని అన్నారు. విభేదించడం, వాదించడం చర్చకు మూల సిద్ధాంతాలని, దూషణలు, కొట్లాటలు కాదని చెప్పారు.
పొట్టి శ్రీరాములు చావుకు దగ్గర అవుతూ చేసిన ఒక్కో రోజు దీక్ష ఒకటిన్నర ఏళ్లకు సమానం. అని, ఆ మహానుభావుడు, బ్రతికినప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా అయన గుర్తుండాలని పవన్ అన్నారు. ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరాలకు దిశా నిర్దేశం చేసేలా ఉండాలని, పశువు, పక్షి, చెట్టు అన్నీ కూడా బాగుండాలని పవన్ ఆకాంక్షించారు.