రెడ్డి నాన్న‌గారూ.. కాపుల గురించెందుకు?: ముద్ర‌గ‌డ కుమార్తె

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుటుంబ పోరుతో కుమిలి పోయే ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా మ‌రోసారిఆయ‌న‌కు కుమార్తె నుంచి షాక్ త‌గిలింది. వైసీపీని వెనుకేసుకు వ‌స్తూ.. ఆయ‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ముద్ర‌గ‌డ ఎన్నికల‌కు ముందు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అదేవిధంగా ప‌వ‌న్‌ను ఓడించ‌క‌పోతే పేరులో రెడ్డిని చేర్చుకుంటా నని కూడా చెప్పారు. చివ‌ర‌కు అదే పని చేసి.. ప‌ద్మ‌నాభ‌రెడ్డిగా పేరుమార్చుకున్నారు. త‌ర్వాత కూడా ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్‌సెంట్రిక్‌గా విమ‌ర్శ‌లు చేశారు.

‘డిప్యూటీ సీఎం గారూ..’ అంటూ జ‌న‌సేన నాయ‌కులు త‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని… బూతులు తిడుతున్నార‌ని చెబుతూ.. కాపుల‌కు న్యాయం చేయాల‌ని.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నార‌ని అన్నారు. కాపుల‌కు న్యాయం చేయ‌క‌పోతే.. మీకు విలువ ఉండ‌ద‌ని కూడా ముద్ర‌గ‌డ సెల‌విచ్చారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న కుమార్తె క్రాంతి భార‌తి కౌంట‌ర్ ఇచ్చారు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. త‌న తండ్రిని కార్న‌ర్ చేసిన ఆమె.. జ‌గ‌న్‌కు స‌పోర్టు చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు.

తాజాగా త‌న తండ్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌తి స్పందిస్తూ.. మీ పేరులో “రెడ్డి” అని చేర్చుకున్న త‌ర్వాత కాపుల గురించి మీకెందుకు ఆవేద‌న అని ఆమె ప్ర‌శ్నించారు. ప‌వ‌న్‌కుమీరు సుద్దులు చెప్ప‌న‌క్క‌ర‌లేద‌ని అన్నారు. పేరు మార్చుకున్నా.. మీ మ‌న‌స్త‌త్వం మార్చుకోలేక పోయార‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గ‌తంలో ఎప్పుడైనా జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారా? అని భార‌తి నిల‌దీశారు. గ‌తంలో జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించి ఉంటే.. ఇప్పుడు ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించే అర్హ‌త ఉండేద‌ని.. కానీ, అలా చేయ‌న‌ప్పుడు.. ఇప్పుడు ఎలా ప్ర‌శ్నించే అర్హ‌త ఉంటుంద‌ని అన్నారు.

“ఒకసారి మీ పేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నాక, కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువత భవిష్యత్ ఆశాజ్యోతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయం మీకు ఎందుకో అర్ధం కావడం లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయాలో ఆయనకు స్పష్టత ఉంది. ఏమి చేయాలో మా తండ్రి గారికే స్పష్టత లేదు అనిపిస్తున్నది. శేషజీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా ఒక కూతురుగా సలహాయిస్తున్నాను. మళ్ళీ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే, నేను గట్టిగా ప్రతిఘటిస్తాను.” – అని భార‌తి పేర్కొన్నారు.

అయితే.. గ‌తంలో ఒక‌సారి త‌న కుమార్తె చేసిన విమ‌ర్శ‌ల‌పై స్పందిస్తూ.. ఆమె త‌న ఆస్తికాద‌ని.. త‌న అత్త‌మామ‌ల ఆస్తి అని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.