కొడాలిపై కేసు.. ఇక ద‌బిడిదిబిడే!

అధికారం ఉంది క‌దా అని నోటికి ఎంత వ‌స్తే అంతే వాగే వైసీపీ నేత‌ల్లో ముందుగా వినిపించే పేరు కొడాలి నానిదే. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇది అంద‌రికీ తెలిసిందే. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న అయిదేళ్లలో నాని నోటికి ఎదురు లేకుండా పోయింది. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆయ‌న బూతు పురాణాన్ని కొన‌సాగించారు. ఎన్నో అన్యాయాలు, అక్ర‌మాలు చేశార‌నే ఆరోప‌ణ‌లు నానిపై ఉన్నాయి. కానీ గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మితో నానికి షాక్ త‌గిలింది. ఇప్పుడు ఆయ‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంతో మ‌రో షాక్ త‌ప్ప‌లేదు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను తెచ్చారు. చివ‌ర‌కు ఇదే జ‌గ‌న్ కొంప‌ముంచింద‌నే అభిప్రాయం ఉంది. కానీ అది వేరే సంగ‌తి. ఆ వాలంటీర్ల‌తో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఇంటింటికీ పంచారు. పార్టీ ప‌నులూ చేయించుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వాలంటీర్ల‌తో ప్ర‌చారం చేయించాల‌నుకున్నారు. కానీ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌తో బ్రేక్ ప‌డింది. ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాల‌నుకుంటే వాలంటీర్ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో వేల మంది వాలంటీర్లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి జ‌గ‌న్ కోసం రాజీనామా చేశారని వైసీపీ గొప్ప‌గా చెప్పుకుంది.

కానీ ఇప్పుడు వాలంటీర్లు త‌మ బాధ‌లు బ‌య‌ట‌పెట్టుకుంటున్నారు. వైసీపీ నాయ‌కులు భ‌య‌పెట్టి త‌మ‌తో రాజీనామాలు చేయించార‌ని అస‌లు విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నారు. ఇప్పుడు దీనిపైనే వాలంటీర్లు పోలీసులను ఆశ్ర‌యిస్తున్నారు. కొడాలి నాని భ‌య‌పెట్టి త‌మ‌ను రాజీనామా చేసేలా చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నానితో పాటు ఆయ‌న స‌న్నిహితుడు దుక్కిపాటి శ‌శిభూష‌ణ్‌, గుడివాట ప‌ట్ట‌ణ వైసీపీ అధ్య‌క్షుడు గొర్ల శ్రీనుతో పాటు మ‌రో ఇద్ద‌రు నేత‌ల‌పై ఐపీసీ 447, 506 త‌దిత‌ర సెక్ష‌న్ల కింద గుడివాట వ‌న్‌టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.