అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు .. ఇప్పుడేమంటారు ?!

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని నేను చూడడం ఇదే మొదటిసారి. మా ప్రెసిడెంట్, తమ్ముడు శాసన సభలో అడుగుపెట్టినప్పుడు ఒక థ్రిల్ అనిపించింది. పవన్ ఉప ముఖ్యమంత్రిగా శాసనసభకు రావడం థ్రిల్లింగ్ కంటే ఒక బాధ్యత. పంచాయతీరాజ్, అటవీ పర్యావరణ శాఖలు లోతుగా పని చేయాలని భావిస్తున్నాడు. పదవి తాలూకు పవర్ ను మేం ఆశించడం లేదు. కొత్తగా పదవి వల్ల వ్యక్తిగతంగా పవన్ కు వచ్చే లాభం ఏం లేదు. పవన్ సినిమాల వరకే పవన్ స్టార్. వాస్తవంలో రియల్ లీడర్’ అని జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అన్నాడు. శాసనసభలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆయన శాసనసభకు విచ్చేశారు.

అంతకుముందు ట్విట్టర్ లో నాగబాబు చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతున్నది. “జ‌న‌సేన పార్టీ పెట్టి 10 ఏళ్లు అయినా.. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావ్‌.. ప్రజలు నిన్ను నమ్మలేదు.. కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేవు” అంటూ విమర్శించిన వారందరి నోళ్లన్ని మూతపడేలా పవన్ కళ్యాణ్ బంఫర్ మేజార్టీతో విజయం సాధించాడు అని నాగబాబు పెట్టిన ట్వీట్ పై జనసైనికులు ఈ రోజు కోసమే ఎదురుచూశాం అంటూ బావేద్వేగంతో స్పందిస్తున్నారు.

2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చాడు. 2019లో ఒంటరిగా పోటీ చేసి స్వయంగా పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో జనసేన ఒక స్థానానికి పరిమితం అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో కీలకంగా వ్యవహరించి 21 లోక్ సభ, 164 శాసనసభ స్థానాలు గెలుచుకోవడంలో కీలకం అయ్యాడు పవన్. అంతేకాకుండా జనసేన పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలను గెలుచుకోవడం కొసమెరుపు.