ఏపీ అసెంబ్లీ 16వ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు సభలో ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రమాణ స్వీకారంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న మీమాంసకు తెరదించుతూ ప్రమాణం చేసేందుకు జగన్ వచ్చారు. గత శాసనసభ సమావేశాల సందర్భంగా 151 మంది ఎమ్మెల్యేలతో బలవంతుడిగా, ధీమాగా కనిపించిన జగన్…తాజాగా 11 మంది ఎమ్మెల్యేలతో అదే సభలో బలహీనుడిగా, దీన వదనంతో అడుగు పెట్టడం కనిపించింది.
ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా సీఎం జగన్ డీలాగా కనిపించారు. ఏపీ శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎంతో ధీమాగా కనిపించిన జగన్ కలలో కూడా ఊహించని విధంగా 11 సీట్లకే పరిమితమై దీనంగా ప్రమాణ స్వీకారం చేసిన వైనం చర్చనీయాంశమైంది. సభలో దాదాపు 80 శాతం సభ్యులు పసుపు కండువాలతో కనిపించడంతో సభ మొత్తం పసుపుమయమైంది.
వాస్తవానికి ప్రమాణస్వీకారం అసెంబ్లీలో ప్రమాణం చేస్తున్న సందర్భంగా సభ్యులు తమ తమ పార్టీల కండువాలను వేసుకొని వస్తుంటారు. కానీ, జగన్ మాత్రం కండువా లేకుండానే వచ్చి ప్రమాణస్వీకారం చేశారు. 21 మంది జనసేన ఎమ్మెల్యేలు, తమ పార్టీ కండువాలతో కనిపించారు. ఇటువంటి సభలో తాను కాకుండా పది మంది ఎమ్మెల్యేలతో అడుగుపెట్టిన జగన్ చాలా అసౌకర్యంగా కనిపించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మిగతా సభ్యులకు నమస్కారం చేస్తూ జగన్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మొత్తంగా సభలో జగన్ 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండలేదు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నమస్కారం చేసిన జగన్ సభ నుంచి తన ఛాంబర్ కు వెళ్లారు.
వాస్తవానికి జగన్ అసెంబ్లీకి కూడా ఎప్పుడూ వచ్చే దారిలో కాకుండా వెనుకవైపు నుంచి వచ్చారు. మెయిన్ గేటులో అమరావతి రైతులు, ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుందేమోనన్న భయంతో జగన్ ఇలా చేశారని తెలుస్తోంది. సరిగ్గా తన ప్రమాణం వంతు వచ్చే సమయానికి 5 నిమిషాల ముందు సభలోకి వచ్చిన జగన్ ప్రమాణ స్వీకారం చేసి 2 నిమిషాల్లో వెళ్లిపోయారు. మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత జగన్ ప్రమాణం చేసేలా అనుమతివ్వాలని చంద్రబాబును వైసీపీ నేతలు రిక్వెస్ట్ చేయడంతో చంద్రబాబు అనుమతించారు. లెక్క ప్రకారం అయితే, ప్రతిపక్ష హోదా దక్కని నేపథ్యంలో ఎమ్మెల్యేగా జగన్ తన వంతు వచ్చినప్పుడు ప్రమాణం చేయాలి.
మరి రాబోయే రోజుల్లో జగన్ సభలో ఉంటారా లేదంటే తన పార్టీ నేతలతో చెప్పిన విధంగా అసెంబ్లీని బాయ్ కాట్ చేసి ప్రజల మధ్యకు వెళతారా అన్నది తేలాల్సి ఉంది. అయితే, ప్రతిపక్ష హోదా కూడా లేని సభలో జగన్ ఉండే అవకాశాలు తక్కువని, పెద్దిరెడ్డికి సభా వ్యవహారాలు అప్పగించి జగన్ అసెంబ్లీకి రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates