ఏపీ అసెంబ్లీలో ఎమోషనల్ మూమెంట్స్

2024 ఎన్నికల ఫలితాలు వచ్చాక తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే కానీ.. ఈసారి అసెంబ్లీలో కొన్ని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోయాయి. అవి కోట్లమందికి భావోద్వేగాన్ని కలిగించాయి. అన్నింట్లోకి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన దృశ్యం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

జనసేన పార్టీ పెట్టి పదేళ్లు దాటిపోగా.. ఎట్టకేలకు పవన్ ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో ఆయన పోటీయే చేయలేదు. 2019లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో వైసీపీ నుంచి ఆయన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో తెలిసిందే. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ ఎద్దేవా చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించడమే కాదు.. డిప్యూట్ చీఫ్ మినిస్టర్ అయి నాలుగు మంత్రిత్వ శాఖలను నిర్వహించబోతున్నాడు పవన్. ఈ నేపథ్యంలో పవన్ ప్రమాణ స్వీకారం వీడియో జనసైనికులకు, మెగా అభిమానులకు తీవ్ర భావోద్వేగాన్ని కలిగించింది.

మరోవైపు రెండేళ్ల కిందట అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి తీవ్రంగా కలత చెంది కన్నీళ్లు పెట్టుకోవడమే కాక.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే ఈ సభకు వస్తానంటూ ఛాలెంజ్ చేసి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు.. అన్న మాట ప్రకారమే మళ్లీ సీఎంగా సభకు రావడం, ప్రమాణ స్వీకారం చేయడం తెలుగుదేశం అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది.

పవన్ లాగే ఎమ్మెల్యేగా గెలవకపోడంపై వైసీపీ నుంచి ఎన్నో మాటలు పడ్డ నారా లోకేష్ సైతం భారీ మెజారిటీతో నెగ్గి అసెంబ్లీలో అడుగు పెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా తెలుగుదేశం అభిమానులకు ఉద్వేగాన్ని కలిగించింది.

ఇదిలా ఉంటే.. వైసీపీ వాళ్లకు మాత్రం నేటి దృశ్యాలు ఎంతమాత్రం మింగుడుపడనివే. ఇదే సభలో ఐదేళ్లు ఎక్కడలేని వైభవం చూసిన జగన్.. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగు పెట్టడం.. ప్రమాణ స్వీకారం సమయంలో పేరు కూడా సరిగా పలకలేక తడబడడం.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభలో ఉండకుండా తన ఛాంబర్‌కు వెళ్లిపోవడం.. చర్చనీయాంశంగా మారింది.