పార్టీ అధినేత జగన్‌కు సైతం అంతుచిక్కకుండా.. కొందరు నాయకులు రాజకీయాలు చేస్తున్నారా? వారి వ్యూహాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారా? అంటే..ఔననే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. గెలుస్తారని అనుకున్న నాయకులు.. కూడా ఓడిపోయారు. 164 మంది నాయకులు ఓడిపోవడం.. పార్టలోనూ చర్చనీయాంశమైంది. అయితే.. ఈ పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు 164 మందిలో 40 – 60 మంది పక్క చూపులు చూస్తున్నారు.
ఏ చిన్న అవకాశం వచ్చినా.. వారు పార్టీ మారిపోవడం ఖాయమని తెలుస్తోంది. అవకాశం సృష్టించుకునై నా.. పార్టీ మారేందుకు ప్రయత్నించేలా చూస్తున్నారు. వ్యాపారాలు, వ్యవహారాలు నడుపుతున్న వారంతా ఈ జాబితాలోనే ఉన్నారు. కొందరు ఎన్నికలకు ముందు జారుకోగా.. ఇప్పుడు ఓడిన నాయకులు మరింత మంది పార్టీకి రాంరాం చెప్పనున్నారు. ఎందుకంటే.. వచ్చే ఐదేళ్ల పాటు వారు వైసీపీలోనే ఉంటే.. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. పైగా.. ఖర్చు పెరుగుతుంది. ఈ కారణాలు కొందరిని వేధిస్తున్నాయి.
మరికొందరు మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం కోసం చూసుకుంటున్నారు. వీరు ఎవరు ఏయే ప్రయత్నా లు చేస్తున్నారనే విషయం సోషల్ మీడియా ఎప్పుడో పసిగట్టింది. ఇక, వైసీపీ అధినేత మాత్రం పసిగట్టకుండా ఉంటారా? కానీ.. జంప్ చేసేవారు వీరేనంటూ.. వినిపిస్తున్న.. జాబితాలో ఉన్న వారంతా.. ఇప్పుడు .. మౌనంగా ఉన్నారు. అంతేకాదు.. జగన్ గురువారం నిర్వహించిన విస్తృత స్తాయి సమావేశానికి కూడా హాజరయ్యారు. జగన్ చెప్పిందంతా కూల్‌గా విన్నారు. ఆ తర్వాత.. వెళ్లిపోయారు.
ఇక్కడ వారి వ్యూహం ఏంటంటే.. ఈ సమావేశానికి హాజరు కాకపోతే.. మరింతగా తమపై ప్రచారం జరుగుతుందనే! వెళ్లేది ఎలానూ వెళ్తాం కాబట్టి.. వెళ్లేవరకు అనవసర రచ్చ ఎందుకని నాయకులు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం. చిత్రంఏంటంటే.. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో చాలా మంది గతంలో ఇతర పార్టీల నుంచి జంప్ చేసి వచ్చిన వారే కావడం గమనార్హం. మరి వీరి వ్యూహాలను జగన్ పసిగట్టే ఉంటారు. సో.. ఏం చేస్తారో చూడాలి.