మాజీ మంత్రి, వైసీపీఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని తన తీరును ఏమాత్రం మార్చుకోలేదు. తాను గెలిచి తీరుతానని శపథం చేసిన ఆయనను గుడివాడ ప్రజలు చిత్తుగా 47 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. అయినప్పటికీ.. ఆయనలో మార్పు కనిపించలేదు. తాజాగా ఆయన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి నోరు చేసుకున్నారు.
వైసీపీ తరఫున గెలిచిన 11 మంది కౌరవుల సభలోకి అడుగు పెడుతున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించా రు. చంద్రబాబు మాయ మాటలు చెప్పి.. షో చేసి.. గెలిచారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పటి వరకు అమలు చేయకుండా.. పోలవరం, అమరావతి సందర్శన యాత్రలంటూ.. నాటకాలు ఆడుతున్నారని అన్నారు. దమ్ముంటే.. సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
ఏదో ఒక రకంగా మాయ మాటలు చెప్పడం.. అధికారంలోకి రావడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని కొడాలి విమర్శించారు. తాము ఓడిపోయినా.. సత్యం-ధర్మ-న్యాయం ఎప్పటికీ నిలబడుతుందన్నా రు. రుషికొండపై నిర్మించిన భవనాలను జగన్ సొంత ఆస్తిగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. కానీ, ఆయనేమీ సొంతగా వాటిని నిర్మించుకోలేదన్నారు. ప్రభుత్వం కోసమే నిర్మించారని అన్నారు. కానీ, ప్రభుత్వ తీరు చూస్తే.. జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
అధికారంలో ఉన్నప్పుడే.. జగన్ ప్రభుత్వ ఆస్తులను వినియోగించుకోలేదని.. ఇప్పుడు మాత్రంఎందుకు వినియోగించుకుంటారని.. ఆయనకు ప్రభుత్వ భవనాలు వాడుకునే ఖర్మ పట్టలేదని కొడాలి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. రుషి కొండభవనాలను చంద్రబాబు వాడుకుంటారో.. ఆయన మనవడికి రాసిస్తారో.. ఆయన ఇష్టమని అన్నారు. సూపర్ సిక్స్ కోసం తాము నిలదీస్తామన్నారు. ఇప్పుడు జరుగుతున్న నాటకాలు కట్టిపెట్టి ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రశ్నించారు.