ఎన్నికల ఫలితాల్లో బొక్క బోర్లా పడ్డా వైసీపీ అధినేత జగన్.. ఇన్నాళ్లకు వాస్తవం గ్రహించారు. పార్టీ అంటే.. కేవలం సంక్షేమ పథకాలు కాదని.. పార్టీ అంటే.. నాయకులని ఆయన గుర్తించినట్టున్నారు. ఈ క్రమంలోనే నాయకులను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. తాజాగా పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశానికి జగన్ పిలుపునిచ్చారు. ఈ నెల 19న తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు పోటీ చేసి ఓడిన అభ్యర్ధులందరినీ కూడా ఆహ్వనించారు.
వీరితో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అభ్యర్ధులను కూడా ఆహ్వనించారు. అందరూ విదిగా హాజరు కావాలంటూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో జగన్ వారిని పక్క చూపులు చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటు న్నారనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. వచ్చే ఐదేళ్లు కూడా.. పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురు కానుంది. ఇది తప్పదు. కక్ష పూరిత రాజకీయాలు, కుట్ర పూరిత రాజకీయాలు లేకపోయినా.. వారు గతంలో చేసిన నిర్వాకాలపై విచారణలు, చట్ట పరంగా చర్యలు ఉంటాయనే చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీలో ఓడిపోయి.. వివాదాలకు కేంద్రంగా ముద్రపడిన నాయకులు పలువురు.. తమ ఇల్లు చక్కబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాపారాలు, వ్యవహారాలు.. ఏవైనా కూడా.. నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉంటే సేఫ్ కాదని భావిస్తున్నారు. దీంతో పార్టీ మార్పు దిశగా అంతర్గత చర్చలు చేస్తున్నారు. దీనిని పసిగట్టిన.. వైసీపీ అధిష్టానం.. చేతనైనంత వరకు పార్టీ నాయకులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంటే.. ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకున్న జగన్..ఇప్పుడు పార్టీ ఓడిన 15 రోజుల్లోనే ఈ తరహా సమావేశం ఏర్పాటు చేయడం వెనుక పార్టీ నేతలను నిలబెట్టుకోవడమే అజెండా అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. మరి జగన్ ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.