ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ మరో ఆఫర్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసిన కిరణ్ కుమార్ ఓటమి పాలయ్యారు. తన రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ఓటమి కోసం కిరణ్ కుమార్ గట్టిగానే కష్టపడ్డా కానీ ఫలితం లేకపోయింది. ఒకవేళ కిరణ్ కుమార్ ఎంపీగా గెలిస్తే మోడీ కేంద్ర కేబినేట్‌లో ఆయనకు చోటు దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ అదృష్టం దక్కలేదు. దీంతో ఇప్పుడు ఆయనకు తెలంగాణ గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో సంచలన సమీకరణాలు త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్‌గా కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ ప్రభుత్వం నియమిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మంచి పట్టున్న కిరణ్‌కుమార్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించి, ఆయన సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు టాక్.
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రాష్ట్ర విభజన తర్వాత వెనుకబడ్డారు. కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఆయన ఈ లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి యాక్టివ్ అయ్యారు. తెలంగాణలోనూ బీజేపీ సమావేశాల్లో పాల్గొన్నారు. మరోవైపు కిరణ్ కుమార్‌కు గవర్నర్ పదవి విషయంలో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణకు ఇంఛార్జీ గవర్నర్ ఉన్నారు. దీంతో కిరణ్ కుమార్‌ను పూర్తిస్థాయి గవర్నర్‌గా నియమించి ఇక్కడి రాజకీయాల్లో మరో విధంగా చక్రం తిప్పాలనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు చెబుతున్నారు.