‘రుషికొండ ‘ లీల‌లు చాలానే ఉన్నాయ్‌: నారా లోకేష్‌

విశాఖప‌ట్నంలో రుషికొండ పై మాజీ సీఎం జ‌గ‌న్ హ‌యాంలో నిర్మించిన విలాస‌వంత‌మైన ప్యాలెస్‌ను ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మీడియాను తీసుకువెళ్లి ప‌రిశీలించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా లోప‌ల ఎలాంటి సౌక‌ర్యాలు ఉన్నాయి… ఎలాంటి విలాస‌వంత‌మైన భ‌వ‌నాలు ఉన్నాయి? అనే విష‌యాలు వెలుగు చూశాయి. నిజానికి ఈ నిర్మాణం గ‌త మూడేళ్ల‌లో చేప‌ట్టినా.. పురుగును కూడా పోనివ్వ‌నంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

అయితే.. ప్ర‌జాతీర్పుతో కుప్ప‌కూలిన వైసీపీ ప్ర‌భుత్వం త‌ర్వాత టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. వ‌చ్చిన వారంలోనే మాజీ మంత్రి గంటా ఇక్క‌డ ప‌ర్య‌టించారు. రుషికొండ‌పై క‌ట్టిన భ‌వ‌నంలోని విలాసాల‌ను ఆయ‌న బాహ్య ప్ర‌పంచానికి చూపించారు. దీనిపై మంత్రి, టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ స్పందిస్తూ.. రుషికొండ లీల‌లు చాలానే ఉన్నాయ‌ని అన్నారు. ఇంకా అనేక ఫొటోలు రావాల్సి ఉంద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే వాటిని కూడా బ‌య‌ట పెడ‌తామ‌ని తెలిపారు.

కృష్ణా న‌ది ప‌క్క‌న క‌ట్టిన ప్ర‌జావేదిక‌ను దారుణ‌మ‌ని పేర్కొంటూ.. నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని చెబుతూ కూల్చివేశార‌ని.. నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మ‌రి కొండ మొత్తాన్నీ తొలిచేసి ప్యాలెస్ ఎలా క‌ట్టార‌ని.. దీనిని ఏ నిబంధ‌న‌లు పాటించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అన్నింటినీ చంద్ర‌బాబు వెలికి తీస్తార‌ని చెప్పారు. ఇక, టీడీపీ నేత‌ల‌పైనే వైసీపీ నాయ‌కులు దాడులు చేసి హ‌త్య‌లు చేస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌మ పార్టీ నాయ‌కులు ముగ్గురు హత్య‌కు గుర‌య్యార‌న్నారు.

తాము త‌లుచుకుంటే వైసీపీ నాయ‌కులు ఇబ్బంది ప‌డ‌తార‌ని.. కానీ, చంద్ర‌బాబు దూర‌దృష్టితో త‌మ‌ను క‌ట్ట‌డి చేస్తున్నార‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు పెద్ద పీట వేయాల‌న్న ఉద్దేశంతో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్‌ను ఉక్కుపాదంతో అణిచేస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే దీనిపై ఒక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని నారా లోకేష్ వివ‌రించారు.