వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల్లో ఓటమిపై మరోసారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “మంచి చేశాం.. అయినా.. ఓడిపోయాం. ఎలా జరిగిందో ఎక్కడ ఏం జరిగిందో అర్ధం కావడం లేదు” అని అన్నారు. గత ఐదేళ్లలో ఎన్నడూ చేయలేని విధంగా రాష్ట్రంలో మంచి పరిపాలన అందించామన్నారు. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్రం కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న నలుగురు లోక్‌సభ సభ్యులు, ఇతర రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశామని .. అయినా ఎందుకు ఇలా జరిగిందో అర్ధం కావడం లేదేన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదంటూ.. తాను ఇచ్చిన పథకాలు, సంక్షేమాన్ని జగన్ మరోసారి ప్రస్తావించారు. “చాలా చిత్తశుద్ధితో పనిచేసి, మేనిఫెస్టోను అమలు చేశాం. ఏ నెలలో ఏం ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశాం. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ, ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశాం. ప్రజల ఇంటివద్దకే పరిపాలనను తీసుకెళ్లాం. అవినీతికి చోటులేకుండా, వివక్ష తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు సంక్షేమ అమలు చేశాం” అని జగన్ చెప్పారు.
సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలకే బాధ్యతలు
ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే వైసీపీ పాలనకు, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం తమకు ఉన్నాయని చెప్పారు. పార్లమెంటులో 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారని తెలిపారు. ఇది వరకు ఉన్నట్టుగానే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని, లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారని జగన్ చెప్పారు.
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని జగన్ తెలిపారు. అందరికీ తాను అందుబాటులో ఉంటానని అన్నారు. ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, పరిమళ్ నత్వానీ తదితరులు పాల్గొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates