ఇది కదా జ‌గ‌న్‌ బాబు ని చూసి నేర్చుకోవలసింది

ఏపీలో చంద్ర‌బాబు మార్కు పాల‌న ప్రారంభ‌మైంది. ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా.. వ్యాఖ్య‌లు చేసినా.. ఇప్పుడు మాత్రం చాలా ప‌ద్ధ‌తికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్ర‌ధానంగా నిర్ణ‌యాల్లో స‌ర‌ళ‌త్వం చోటు చేసుకుంటోంది. వివాదాల‌కు దూరంగా.. విచ‌క్ష‌ణ‌కు ద‌గ్గ‌ర‌గా చంద్ర‌బాబు నిర్ణ‌యాలు క‌నిపిస్తున్నాయి. తాజాగా గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు తెరుచుకున్నాయి. అయితే… గ‌త వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన జ‌గ‌న‌న్న విద్యాకానుక‌ ప‌థ‌కం కింద‌.. 9 ల‌క్ష‌ల మందికిపైగా చిన్నారుల‌కు కానుక‌లు పంచాలి.

ఈ విద్యాకానుక‌లో ప్ర‌తి విద్యార్థికీ.. ఒక బ్యాగు, పుస్త‌కాలు, షూస్‌, బెస్ట్‌, టై, రెండు జ‌త‌ల యూనిఫాం ఉన్నాయి. అయితే.. చిత్రంగా వీటిలో బ్యాగుపై జ‌గ‌న్ బొమ్మ‌, బెల్ట్‌పై జ‌గ‌న్ బొమ్మ ఉన్నాయి. ఇక‌, షూస్‌పై మాత్రం జ‌గ‌న‌న్న విద్యా కానుక అని రాసి ఉంది. దీంతో అధికారులు త‌ట‌ప‌టాయించారు. ఇవ్వాలా? వ‌ద్దా..? అనే మీమాంస‌లో ప‌డిపోయారు.

దీంతో గురువారం ఉద‌యం వ‌ర‌కు కూడా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక పోయారు. ఎందుకంటే రాష్ట్రంలో స‌ర్కారు మారిపోయింది. కాబ‌ట్టి గ‌త ముఖ్య‌మంత్రి ఫొటోలు ఉన్న వాటిని పంచితే.. ఏం జ‌రుగుతుందో అని భ‌య‌ప‌డ్డారు.

అయితే.. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ చంద్ర‌బాబుకు ఈ విష‌యాన్ని మీడియా చెప్పింది. దీంతో ఆయ‌న వెంట‌నే.. జ‌గ‌న్ బొమ్మ ఉన్నా.. స‌రే.. పంచేయండి. రెండు రోజుల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయండి అని అక్క‌డిక్క‌డే తేల్చి చెప్పారు.

ఈ విష‌యాన్ని నేరుగా సీఎస్‌కు చెబుతున్న‌ట్టు కూడా ఆయ‌న వెల్ల‌డించారు. దీంతో అంద‌రూ ఖిన్నుల‌య్యారు. గ‌తంలో చంద్ర‌బాబు చేప‌ట్టిన అనేక ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ నిలిపి వేశారు. దీంతో కోట్ల‌కు కోట్ల రూపాయ‌ల ప్ర‌జా ధ‌నం వృథా అయిపోయి.. తుప్పు ప‌ట్టింది. కానీ, చంద్ర‌బాబు ఇలాంటి నిర్ణ‌యం తీసుకునే స‌రికి అంద‌రూ అవాక్క‌య్యారు.

ఇదే విష‌యాన్ని టీడీపీ అధికారిక వెబ్‌సైట్ లోనూ పేర్కొంది. క‌క్ష‌లు, కుట్ర రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు తెర‌దించాల‌ని పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. కానుక‌ల‌ను పంపిణీ చేస్తున్న చంద్ర‌బాబును ఆద‌ర్శ నాయ‌కుడిగా వారు పేర్కొన్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు.. సిగ్గు ప‌డాలేమో.. జ‌గ‌న్‌!! అనే కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.