ఏపీ సర్కారులో గత ఐదేళ్లుగా కొన్ని అలవాట్లకు అలవాటు పడిన అధికారులు.. ఇంకా వాటిని వదిలించుకోలేక పోతున్నారు. పదేపదే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెబుతున్నా.. సదరు పాత వాసనలను వారువదిలి పెట్టలేక పోతున్నారు.
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత.. చోటు చేసుకున్న రెండు కీలక పరిణామాలపై ఇప్పుడు సర్కారు కూడా తీవ్రంగా స్పందించింది. దీనిలో ప్రధానంగా.. పరదాలు కట్టడం. రెండోది ట్రాఫిక్‌ను గంటలకొద్దీ నిలిపి వేయడం. ఈ రెండు విషయాలపై చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే అధికారులను హెచ్చ
రించారు. అలా చేయొద్దని కూడా చెప్పారు.
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరు సలహా ఇచ్చారో.. ఏమోకానీ.. ఆయన బయటకు వస్తే చాలు.. పోలీసులు అతిగా వ్యవహరించారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో 10 అడుగుల ఎత్తున పరదాలు కట్టేసేవారు. దీంతో ఆయనకు చుట్టూ కూడా.. అంతా బాగున్నట్టుగా ఉండేది.
ఇక, జగన్ పర్యటనలో మరో కీలక విషయం చెట్టు నరికేయడం. చిన్నదనీ లేదు.. పెద్దదనీ లేదు. అడ్డం వచ్చిందని లేదు.. అవసరం లేదని కూడా లేదు. చెట్టుఏదైనా.. ఎన్నేళ్లయినా.. జగన్ వస్తున్న మార్గంలో వాటిని శత్రువులగా చూశారు. తెగనరికేశారు.
ఇక, జగన్ ఆకాశంలో హెలికాప్టర్ ద్వారా ప్రయాణించినా.. రోడ్డుపై ఆయన కాన్వాయ్‌లో వెళ్లినా.. గంటల కొద్దీ వాహనాలను నిలిపివేసేవారు. అంతేకాదు.. ఆయన పర్యటించే ప్రాంతాల్లో దుకాణాలను బంద్ చేయించేవారు. రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకుని పొట్ట పోసుకునేవారిని కూడా వదిలి పెట్టేవారు.
కట్ చేస్తే.. ఇవన్నీ.. జగన్ సర్కారుకు ఎసరు పెట్టాయి. వీటిని గమనించిన చంద్రబాబు.. తాను గెలిచీ గెలవగానే.. సంబంధిత అధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. పరదాలు కట్టద్దని, చెట్లు నరకొద్దని.. ట్రాఫిక్‌ను ఆపి.. ప్రజలను ఇబ్బంది పెట్టద్దని కూడా చెప్పారు.
కానీ, అధికారులు ఏమనుకున్నారో.. ఏమో.. జగన్ పాలనే ఉందని భావించారో ఏమో.. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు వస్తున్న మార్గంలో పరదాలు కట్టారు. దుకాణాలు బంద్ చేయించారు. ఈ విషయంలో ఆలస్యంగా తెలిసిన నారా లోకేష్.. ఇలా ఎందుకు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. వెంటనే వాటిని ఆపాలని కూడా అన్నారు.
ఇక, గురువారం మధ్యాహ్నం.. విజయవాడ దుర్గగుడి దర్శనానికి చంద్రబాబు కుటుంబం రానుంది. ఈ నేపథ్యంలో భక్తులను గంటల కొద్దీ లైన్లలోనే కిక్కిరిసిపోయేలా వ్యవహరించారు అధికారులు. అంతేకాదు.. విజయవాడలోనూ ట్రాఫిక్‌నిలిపి వేశారు. దీంతో అధికారుల తీరు మారడం లేదని. టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. వీరికి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు.