ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలలో ఈ ఎన్నికల్లో టీడీపీ పది స్థానాలలో విజయం సాధించింది. వైసీపీ ఎర్రగొండపాలెం, దర్శి స్థానాలకు పరిమితం అయింది. గత ఎన్నికల్లో వైసీపీ ఎనిమిది, టీడీపీ నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. అద్దంకి నుండి గెలిచిన గొట్టిపాటి రవికుమార్, కొండపి నుండి గెలిచిన డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామిలకు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది.
2004 లో మార్టూరు నుండి, 2009లో అద్దంకి నుండి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున ఎన్నికైన గొట్టిపాటి రవికుమార్, 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో విజయం సాధించి వైసీపీ నుండి తీవ్ర వత్తిడి, వేధింపులు ఎదుర్కొన్నాడు. ఆయనకు చెందిన 11 గ్రానైట్ క్వారీలు, రెండు పరిశ్రమలను జగన్ ప్రభుత్వం మూసివేయించింది.
ఒత్తిళ్లను తట్టుకోలేక కరణం బలరాం, శిద్దా రాఘవరావులు పార్టీకి గుడ్‌బై చెప్పినా రవికుమార్ మాత్రం టీడీపీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చిన హనిమిరెడ్డి మీద 24 వేల ఓట్లతో గెలుపొందారు.
ప్రభుత్వ డాక్టర్ అయిన కొండపి ఎమ్మెల్యే డా.డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి దామచర్ల కుటుంబ సహకారంతో రాజకీయాల్లోకి ప్రవేశించి 2014, 2019 ఎన్నికల్లో వరసగా విజయం సాదించాడు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ మీద 24,756 ఓట్లతో హ్యాట్రిక్ విజయం సాధించారు.
వివాదరహితుడిగా పేరున్న స్వామి వైసీపీ ప్రభుత్వంలో వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అసెంబ్లీలో అధికారపక్షం దాడిచేసిన, నియోజకవర్గంలో ఇంటి మీద దాడులు చేసినా వెరవకుండా పార్టీలోనే కొనసాగారు. దీంతో ఆయన నిబద్దతకు బహుమతిగా చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates