సెంటిమెంట్ బ్రేక్ చేసి 30 ఏళ్ల తర్వాత మంత్రి !

పయ్యావుల కేశవ్. 1994లో ఎన్టీఆర్ పిలుపుతో 29 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. స్వతంత్ర అభ్యర్థి శివరామిరెడ్డి మీద విజయం సాధించాడు. ఆ తర్వాత 1999లో పయ్యావుల ఓటమి పాలయ్యాడు.

ఇటీవల గెలుపుతో పయ్యావుల ఉరవకొండలో 5 సార్లు విజయం సాధించాడు. అయితే గత ఇరవై ఏళ్లుగా పయ్యావుల గెలిస్తే పార్టీ ఓడిపోతుంది. పయ్యావుల ఓడితే పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న సెంటిమెంట్ మొదలయింది. 

ఇటీవల ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని పయ్యావుల చెబుతూ వచ్చాడు. అన్నట్లు గానే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి మీద పయ్యావుల 21 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించాడు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 30 ఏళ్లకు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. గత 30 ఏళ్లలో జరిగిన ఏడు ఎన్నికలలో పయ్యావుల అయిదు సార్లు విజయం సాధించాడు. 

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి 1994 ఎన్నికల్లో పయ్యావుల తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 1999 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్‌ గెలుపొందారు.

టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 2014లో పయ్యావుల ఓటమి చెందారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో కేశవ్‌ గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో పయ్యావుల కేశవ్‌ విజయం సాధించారు. కూటమి అధికారంలోకి వచ్చింది. 

1997 నుంచి 1999 వరకూ టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, 2002-09 వరకూ పార్టీ విప్‌గా,  2009-12 వరకూ అసెంబ్లీలో పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ మెంబర్‌గా, 2004-14 వరకూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన 2015లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ప్రభుత్వ చీప్‌ విప్‌గా పనిచేశారు. 2019 నుంచి  పీఏసీ చైర్మనగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయంతో చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి సాధించారు.  1985లో ఉరవకొండ నుండి గెలిచిన గుర్రం నారాయణప్ప అప్పటి ఎన్టీఆర్ మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. ఆ తర్వాత 39 ఏళ్లకు ఉరవకొండ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కడం విశేషం.