బీజేపీకి సాయిరెడ్డి క్లాస్ వార్నింగ్‌..

చింత‌చ‌చ్చినా పులువు చాద‌న్న‌ట్టుగా ఉంది వైసీపీ వైఖ‌రి. తాజాగా ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, నెల్లూరు పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన విజ‌య‌సాయిరెడ్డి సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయ‌న క్లాస్‌ వార్నింగ్ ఇచ్చారు.

వాస్త‌వానికి ఏపీలో వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. వైనాట్ 175 అన్న వైసీపీ.. కేవ‌లం 11 స్థానాల‌కు ప‌డిపోయింది. ఇక‌, పార్ల‌మెంటు స్థానాల్లోనూ కేవ‌లం 4 చోట్ల గెలుపు గుర్రం ఎక్క‌డి.. బ‌తిపోయాను అన్న‌ట్టుగా మారిపోయింది. అయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ నాయ‌కుల దూకుడు అయితే త‌గ్గ‌లేదు. తాజాగా సాయిరెడ్డి చేసిన హెచ్చ‌రిక‌ల్లోనూ ఇదే టోన్ క‌నిపించింది.

బీజేపీకి మా అవ‌స‌రం లేద‌ని అనుకుంటే పొర‌పాటే అని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడు తూ.. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన పండ‌గ అయిపోయిన‌ట్టు కాద‌ని అన్నారు. త‌మ అవ‌స‌రం బీజేపీకి ఇంకా ఉంటుంద‌ని తెలిపారు.

రాజ్య‌స‌భ‌లో టీడీపీ ప‌నితీరు జీరో అని వ్యాఖ్యానించిన సాయిరెడ్డి.. త‌మ‌కు రాజ్య‌స‌భ‌లో 11 మంది ఎంపీలు ఉన్నార‌ని తెల‌పారు. రాజ్య‌స‌భ‌లో బీజేపీ కి త‌మ మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని ఆ పార్టీ నాయ‌కులు గుర్తు పెట్టుకోవాల‌ని క్లాస్ వార్నింగ్ ఇచ్చారు.

“లోక్ సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే. వైసీపీకి రెండు స‌భ‌ల్లో క‌లిపి 15 మంది ఎంపీల బ‌లం ఉంది. ఈ విష‌యాన్ని బీజేపీ గుర్తు పెట్టుకుంటుంద‌ని అనుకుంటున్నాం. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కూడా భాగస్వామి అయినప్పటికీ, రాజ్యసభ విషయానికి వ‌చ్చేసరికి బీజేపీకి వైసీపీ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి.

రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. పార్లమెంటులో వాళ్లు టీడీపీపై ఎంత ఆధారపడతారో, వైసీపీపై రాజ్య‌స‌భ‌లో అంతే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది“ అని సాయిరెడ్డి తెలిపారు. అంతేకాదు.. ఈ విష‌యాన్ని బీజేపీ పెద్ద‌లు గ‌మ‌నించే ఉంటార‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పారు. కానీ, లోక‌ల్ లీడ‌ర్లు కూడా గుర్తు పెట్టుకోవాల‌ని సాయిరెడ్డి సూచించారు. మ‌రి ఈ క్లాస్ వార్నింగ్ పై బీజేపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.