విషయం ఏదైనా వాదనలోకి వచ్చినంతనే ఎవరు ఏ పార్టీకి అనుకూలమన్న భూతద్దాలు వేసుకొని చూడటం కామన్. అయితే.. పార్టీలతో సంబంధం లేకుండా.. మంచిని మంచిగా.. చెడును చెడుగా చూసే వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారికి ఏ ఇజాలు ఉండవు. సంప్రదాయాల్ని పాటిస్తూ.. నిబంధనల్నిపక్కాగా అనుసరిస్తూ ఉంటే చాలని భావిస్తారు. అలాంటి వారికి దేశంలోని అధికారపక్షాలు వ్యవహరించే ధోరణి ఎప్పుడూ తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా రాజ్యసభలో వ్యవసాయానికి సంబంధించిన రెండు బిల్లుల్ని ఆమోదించుకునే సమయంలో వ్యవహరించిన వ్యవహారశైలి చూస్తే.. ఈ పరిస్థితేమిటి? అన్న భావన కలుగక మానదు.
ప్రజాసమస్యల్ని పరిష్కరించటానికి ప్రజల నుంచి ఎన్నికైన వారు.. ఒక అంశంపై భేధాభిప్రాయాలు ఉంటే.. వాటిని చర్చల రూపంలో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. కొన్ని సందర్భాల్లో అధికారపక్షం తగ్గాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షం వెనకుడుగు వేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదు.ఇలాంటి సందర్భాల్లో చోటు చేసుకునే పరిణామాల్ని చూస్తే.. మన దేశంలో గౌరవనీయ సభలు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అన్న భావన కలుగక మానదు.
వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించే క్రమంలో రాజ్యసభలో ఆదివారం చోటు చేసుకున్న పరిణామాల్ని చూసిన వారు ఎవరైనా అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తారు. అయితే.. ఇక్కడ మర్చిపోకూడని అంశం ఏమంటే.. నిన్నటి రోజున ఏం జరిగిందో.. సరిగ్గా కొన్నేళ్ల క్రితం మన్మోహన్ సర్కారు సైతం ఇదే తీరును ప్రదర్శించటాన్ని మర్చిపోకూడదు. కాస్త అటు ఇటుగా పదేళ్ల క్రితం అంటే 2010 మార్చి 9న అప్పటి యూపీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళా బిల్లును ఆమోదించుకోవటానికి మార్షల్ ను మొహరించుకొని.. తన పంతాన్ని ఎలా అయితే నెగ్గించుకుందో.. తాజాగా అలాంటి సీనే ఎన్డీయే సర్కారులోనే రిపీట్ అయ్యిందని చెప్పాలి.
అప్పట్లో ఎలాంటి వ్యూహాన్ని మన్మోహన్ సర్కారు అమలు చేసిందో.. తాజాగా అలాంటి వ్యూహాన్నే మోడీ సర్కారు అమలు చేసింది. పెద్దల సభలో మార్షల్స్ ను మొహరించి.. తమకుండే బలంతో.. విపక్షాల అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకుండా బిల్లును ఆమోదించిన తీరునే తాజాగా అమలు చేశారు. ఇదంతా చూసినప్పుడు తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలన్న మొండితనం.. పట్టుదల అటు యూపీఏ సర్కారులోనూ.. ఇటు ఎన్డీయే సర్కారులోనూ కనిపిస్తుంది.
ఇవాల్టి రోజున ఘోరం జరిగిపోయిందని గుండెలు బాదుకునే విపక్షం.. పదేళ్ల క్రితం అధికారపక్షంగా తాము ఏ తీరున వ్యవహరించామో.. ఇప్పుడు ఇదే తీరును మోడీ సర్కారు ప్రదర్శించిన విషయాన్ని మర్చిపోతారు. ఇదంతా చూస్తే.. రాబోయే రోజుల్లో మోడీ సర్కారు విపక్ష స్థానంలో ఉండి.. అధికారపక్షంలో యూపీఏనో.. మరే ప్రభుత్వమో ఉన్నప్పుడు తాము ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బిల్లు ఆమోదానికి ఇలాంటి తీరునే ప్రదర్శించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.