జగన్ పై హ‌త్యాయ‌త్నం కేసు పెట్టిన ఆర్ఆర్ఆర్‌

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌కు కొత్త చిక్కు వ‌చ్చింది. ఆయ‌న‌పై కేసు న‌మోద‌య్యే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అదికూడా హ‌త్యాయ‌త్నం కేసు పెట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. గ‌తంలో వైసీపీ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఆ పార్టీ రెబ‌ల్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కుడు, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌రాజు ఉర‌ఫ్ ఆర్. ఆర్‌. ఆర్ ఇచ్చిన కీల‌క కంప్ల‌యింట్‌. తాజాగా ఆయ‌న గుంటూరు ఎస్పీకి నేరుగా ఫిర్యాదు లేఖ రాశారు.

జగన్ ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ జ‌రిగింద‌ని ఆర్‌.ఆర్‌.ఆర్ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న గుంటూరు ఎస్పీకి లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా.. ఏపీ సీఐడీ మాజీ ఛీఫ్ సునీల్ కుమార్, సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుతో పాటు వీరిని ప్రోత్స‌హించిన అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నార‌ని ర‌ఘురామ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలానే.. అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ పైనా ఆయ‌న ఫిర్యాదు చేశారు. తనకు అయిన గాయాలపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటురు ప్ర‌భుత్వ ఆసుప‌త్రి సూపరింటెండెంట్ డా.ప్రభావతిలపైనా ఆర్‌.ఆర్‌.ఆర్ ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే… తనను చంపేస్తానని పివి సునీల్ కుమార్ బెదిరించారని మ‌రో ఫిర్యాదు దీనికి జ‌త చేశారు. వీరిపై త‌క్ష‌ణ‌మే కేసు న‌మోదు చేసి.. విచార‌ణ చేయాల‌ని కోరారు. ఇదేస‌మ‌యంలో తీసుకున్న చ‌ర్య‌లు కూడా త‌న‌కు తెలియ‌జేయాల‌ని అన్నారు.

ఏం జ‌రుగుతుంది?

ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఇచ్చిన ఫిర్యాదుతో గుంటూరు ఎస్పీ త‌ప్ప‌కుండా ఫిర్యాదు న‌మోదు చేయాల్సి ఉంటుంది. కోర్టు సూచ‌న‌ల మేర‌కు లేఖ ద్వారా ఫిర్యాదు వ‌చ్చినా.. త‌గిన ఆధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయ‌క‌పోతే.. ర‌ఘురామ రేపు కోర్టుకు వెళ్తే ఎస్పీపై చ‌ర్య‌లు తప్ప‌వు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పైనా ఆయ‌న హ‌త్యాయ‌త్నం కింద కేసు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే.. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో అధికారులు బిజీగా ఉన్నారు. దీంతో దీనిపై ఆ త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది.