రాయుడుంటే ప్రపంచకప్ వచ్చేదా..

భారత క్రికెట్ జట్టులో తెలుగు క్రికెటర్లకు దక్కిన ప్రాతినిధ్యం, ప్రాధాన్యం చాలా తక్కువ. మ్యాచ్ ఫిక్సింగ్ మరకలంటించుకున్న అజహరుద్దీన్ సంగతి పక్కన పెట్టేస్తే.. భారత జట్టుకు ఎన్నో గొప్ప విజయాలందించిన వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పట్లో సరైన వీడ్కోలు కూడా లభించలేదు. అతను మంచి ఫాంలో ఉండగా 2003 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకుండా దినేశ్ మోంగియా అనే స్థాయి లేని ఆటగాడికి అవకాశం కల్పించి అన్యాయం చేశారు సెలక్టర్లు. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ ముంగిట మరో తెలుగు క్రికెటర్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ ఆటగాడే అంబటి రాయుడు. అతడికి అన్యాయం చేసింది తెలుగువాడే అయిన ఎమ్మెస్కే ప్రసాద్ కావడం గమనార్హం. ప్రపంచకప్‌కు రెండేళ్ల ముందు నుంచి రాయుడు నిలకడగా ఆడుతూ వచ్చాడు. జట్టులో నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్ అతనే అన్న నిర్ణయానికి అందరూ వచ్చేశారు.

కానీ ప్రపంచకప్ ముంగిట రాయుడు కొంచెం తడబడేసరికి అతడిని పక్కన పెట్టేశారు. తమిళనాడుకు చెందిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు అవకాశం కల్పించారు. కానీ అతను ఆల్ రౌండర్ పాత్రకు ఏమాత్రం న్యాయం చేయలేదు. టోర్నీలో పేలవ ప్రదర్శన చేసి మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆ స్థానాన్ని రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లతో భర్తీ చేయాలని చూసి భంగపడింది టీమ్ ఇండియా. కీలకమైన నాలుగో స్థానం విషయంలో ఈ సందిగ్ధత జట్టుపై చాలానే ప్రభావం చూపింది. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ సందర్భంగా నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయినా సరే జడేజా, ధోని గొప్పగా పోరాడి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చారు. కానీ చివర్లో కథ అడ్డం తిరిగింది.

బౌలర్ల ఆధిపత్యం సాగిన ఆ మ్యాచ్‌లో రాయుడు లాంటి ఆటగాడు ఉంటే కథ వేరుగా ఉండేదన్న అభిప్రాయం అప్పట్లో చాలామంది వ్యక్తం చేశారు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయుడి ప్రదర్శన చూశాక ఆ అభిప్రాయం మరింత బలపడింది. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడం తీవ్ర అసంతృప్తికి గురై రిటైర్మెంట్ ఇచ్చేసిన రాయుడు.. తర్వాత కొన్ని నెలలకు మనసు మార్చుకున్నాడు. కానీ అతను దేశవాళీల్లో ఏమీ ఆడలేదు. వేసవిలో జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడింది. ఇలా మొత్తంగా ఏడాదిన్నర పాటు అతను ఆటకు దూరంగా ఉన్నాడు. ఐతేనేం.. ఇప్పుడు ఆ ప్రభావమే కనిపించకుండా ముంబయి బౌలర్లపై విరుచుకుపడుతూ మేటి ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నైని గెలిపించాడు. అతడి ఆటలో కసిని అందరూ గమనించారు. ఈ నేపథ్యంలో రాయుడు ఉంటే గత ఏడాది ప్రపంచకప్ గెలిచేవాళ్లమేమో అన్న అభిప్రాయం సోషల్ మీడియాలో చాలామంది వ్యక్తం చేశారు.