అమరావతిపై జగన్‌కు పవన్ సూటి ప్రశ్న

అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలన్నది తమ పార్టీ వైఖరి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో అమరావతి రైతులకు అండగా ఉంటామని, పోరాడతామని పవన్ గతంలోనే ప్రకటించారు. అమరావతికి వెళ్లి ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావం కూడా ప్రకటించారు. కానీ ఈ మధ్య ఈ విషయంలో పవన్ వైఖరి మారిందనే ప్రచారం జరుగుతోంది. అమరావతి రైతులను ఆయన పట్టించుకోవడం లేదని, మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదని అంటున్నారు. ఐతే ఓ ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రచారాన్ని ఖండించాడు. మూడు రాజధానుల తీర్మానాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పిన పవన్.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని స్పష్టం చేశాడు. ఈ విషయంలో పవన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక సూటి ప్రశ్న వేశాడు.

‘‘కాపులకు మేం రిజర్వేషన్లు ఇవ్వం, వర్గీకరణ మా చేతుల్లో లేదు అని జగన్ ఎన్నికలకు ముందు ఆ రెండు అంశాల విషయంలో తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఇలా మరికొన్ని విషయాలపై స్పష్టంగా చెప్పిన జగన్.. రాజధాని విషయంలో కూడా తన మనసులో మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే అప్పుడే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేవారు. ప్రతిపక్ష నేత హోదాలో అమరావతిని రాధానిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని చెప్పిన జగన్.. ఇప్పుడు ప్రజల మనోభావాలు, వారి ఆస్తిపాస్తులతో చెలగాటం ఆడతానంటే ఎలా? ఏదైనా కష్టం వస్తే ప్రజలు ప్రభుత్వం దగ్గరికెళ్తారు. కాపాడాల్సిన ప్రభుత్వమే మోసం చేస్తే ఎవరికి చెప్పాలి? రాజధాని కోసం అన్నేసి ఎకరాలు అవసరం లేదని, చిన్న రాజధాని చాలని మా పార్టీ అంటే.. వైకాపా నాయకత్వం మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన రాజధానిపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. జగన్ విపక్ష నేతగా ఉంటూనే అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు. ఆయన కదిలినపుడు మీరెందుకు కదలరని నన్ను ప్రశ్నిస్తే.. నేను కూడా అమరావతిలో ఇల్లు తీసుకున్నా. చాలామంది ఇలాగే అమరావతిపై నమ్మకం పెరిగి పెట్టుబడులు పెట్టారు. ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులను అమ్మి ఇక్కడ భూమి కొనుక్కున్నారు. అమరావతి రాష్ట్ర రాజధాని అనే సమష్టి నిర్ణయంలో వైకాపా కూడా భాగస్వామే. ఇప్పుడు మాట మారిస్తే ఎలా’’ అని పవన్ ప్రశ్నించాడు.