వయనాడ్ కు వణక్కం !

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ లోక్ సభ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్‌లో మరోసారి విజయం సాధించిన రాహుల్‌ ఈసారి కొత్తగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏ స్థానానికి ఎంపీగా కొనసాగుతారు, ఏ స్థానాన్ని వదులుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీలోనే ఆయన కొనసాగే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాహుల్ రాయ్ బరేలీని ఎంచుకునేందుకు అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌ దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన రాష్ట్రం. గత కొన్ని దశాబ్దాలుగా క్రమంగా యూపీలో కాంగ్రెస్‌ ఉనికి కోల్పోతున్నది. ఈ ఎన్నికల్లో మాత్రం ఆరు స్థానాలు సాధించి మళ్లీ మెల్లగా పట్టు బిగించింది. ఈ నేపథ్యంలో యూపీలో బలపడే దిశగా రాయ్‌బరేలీ నుంచి కొనసాగేందుకు రాహుల్‌ మొగ్గు చూపవచ్చని అంచనా.

వయనాడ్ లో ఆయన సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాపై 364422 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. అక్కడ ఆయన 647445 ఓట్లు సాధించాడు. యూపీలోని రాయ్ బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ పై 390030 ఓట్లతో విజయం సాధించాడు. ఇక్కడ రాహుల్ కు 687649 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో యూపీలోని అమేథీ, వయనాడ్ ల నుండి పోటీ చేసిన రాహుల్ అమేథీలో ఓడిపోయి వయనాడ్ లో గెలుపొందాడు. మరి కష్టకాలంలో అండగా ఉన్న వయనాడ్ ను వదులుకుంటే ఎలా అన్న వాదన కూడా వినిపిస్తున్నది. మరి రాహుల్ నిర్ణయం ఏం ఉంటుందో ? వేచిచూడాలి.