టీడీపీలో మళ్లీ టికెట్ల పోర ప్రారంభమైందా? నాయకులు పోటీ పడుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది.. టీడీపీ నేతల నుంచి. తిరుపతి పార్లమెంటు సభ్యుడు, వైసీపీ నాయకుడు బల్లి దుర్గా ప్రసాదరావు.. రెండు రోజుల కిందట అనారోగ్యం కారణంగా హఠాన్మరణం చెందారు. దీంతో ఈ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది.
అయితే, దీనికి సంబంధించి ఆరు మాసాల సమయం ఉన్నప్పటికీ.. ఎస్సీ నియోజకవర్గం కావడంతో టీడీపీ కీలకమైన ఇద్దరు నేతలు అప్పుడే.. తమ అనుచరుల ద్వారా ఈ టికెట్ మాకంటే మాకని ప్రచారానికి దిగుతున్నారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేశారు. దాదాపు 4లక్షల 98 వేల ఓట్లను సాధించినా.. ఓటమి పాలయ్యారు. అయితే, ఈ రేంజ్‌లో టీడీపీకి ఓట్లు రావడం సంచలనంగా అప్పట్లో ప్రచారం జరిగింది.
దీనికి కారణం.. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 1984 ఎన్నికల్లో చింతా మోహన్ తప్ప.. తర్వాత ఇక్కడ టీడీపీ విజయం సాధించింది లేదు. పైగా 2004 తర్వాత ఇక్కడ టీడీపీ పోటీ చేసింది కూడా లేదు. ఎప్పటికప్పుడు పొత్తుల్లో భాగంగా.. ఇక్కడ టికెట్‌ను వేరే పార్టీకి కేటాయిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పనబాక సాధించిన మెజారిటీనే గొప్పగా అంతర్గత చర్చల్లో టీడీపీ భావించింది.
సరే.. ఎన్నికల తర్వాత పనబాక ఫ్యామిలీ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు దుర్గాప్రసాదరావు మరణంతో ఈ టికెట్‌నుతమకు ఇవ్వాలనే ఒత్తిడి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. అదేసమయంలో 2004లో ఇక్కడ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్య కూడా ఇప్పుడు ఈ రేసులో ముందున్నారు.
పార్టీ తరఫున ఇటీవల కాలంలో బలమైన గళం వినిపిస్తున్న ఆయనకు ఇటీవల రాజ్యసభకు పంపాలని బాబు భావించారు. ఈ క్రమంలో ఓడిపోతారని తెలిసి కూడా ఆయనను రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకే ఖచ్చితంగా ఇస్తారని.. గెలుపు-ఓటములు పక్కన పెడితే.. పార్టీ తరఫున పనిచేస్తున్న నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉందని తమ్ముళ్లు చెబుతున్నారు. బాబు కూడా వర్ల వైపే మొగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates