‘అబ్ కీ బార్ .. చార్ సౌ పార్’ అంటూ 400 ఎంపీ సీట్లు గెలుస్తామని బీజేపీ ఊదరగొట్టింది. మోడీ మానియాతో లోక్ సభ ఎన్నికలను ఒంటిచేత్తో చుట్టేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అదంతా ఒట్టి మాయేనని తేలిపోయింది.
కేరళలో సినీనటుడు సురేష్ గోపీ ఆ రాష్ట్రంలో బీజేపీకి తొలి విజయం అందిచారు. అక్కడ సురేష్ గోపి విజయం కేవలం ఆయన వ్యక్తిగతమే. గత మూడేళ్లుగా ఆయన ఆ నియోజకవర్గం మీద దృష్టిపెట్టి కష్టపడడంతో ఈ విజయం దక్కింది. తెలంగాణలో ఒక్క బండి సంజయ్, ఆదిలాబాదు సీటు తప్ప… మిగతా వారంతా మోడీ కంటే ముందే ఇక్కడ వెలుగు వెలిగిన నేతలు. వారి గెలుపు కూడా మోడీ మానియా కింద వేయలేం.
ఆంధ్రప్రదేశ్ లో వాస్తవానికి బీజేపీ ప్రభావం నామమాత్రం. అక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం, జనసేన పార్టీలతో జతకట్టడంతో బీజేపీకి కలిసి వచ్చింది. అక్కడ బీజేపీ 3 స్థానాలు గెలవడంతో పాటు, టీడీపీ 16, జనసేన 2 స్థానాలు అదనంగా కలిసివచ్చాయి. ఈ 18 స్థానాలు ప్రస్తుతం కేంద్రంలో మోడీ ప్రధాని కావడానికి కీలకంగా మారాయి.
ఇలాగే దేశంలో చాలామంది బీజేపీ అభ్యర్థులు మోడీ మానియాతో సంబంధం లేకుండా గెలిచిన వారున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ మీద అసంతృప్తి, 2019 ఎన్నికల్లో బాలాకోట్, పుల్వమా సంఘటనల వల్ల బీజేపీకి విజయం దక్కింది తప్పితే మోడీ మానియా ఏమీ లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో బీజేపీ మోదీ ప్రభావం సరిపోదని వివిధ రాష్ట్రాల్లో వెనక్కి తగ్గినట్లు అర్దమవుతుంది.