గత ఎన్నికల్లో మామూలుగా గెలిచి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన, ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదో కానీ.. 151 సీట్లతో అసాధారణ విజయం సాధించడంతో ఆయనకు, వైసీపీ నేతలకు గర్వం తలకెక్కిందనే అభిప్రాయం జనాల్లో బలంగా కలిగింది.
జగన్ ఒక నియంత పాలించినట్లుగా రాష్ట్రాన్ని పరిపాలించడం.. ఏకపక్ష, వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం.. అసెంబ్లీలో టీడీపీని, బయట జనసేనను చూసి వైసీపీ నేతలు విపరీతంగా ఎగతాళి చేయడం.. జనం గమనించారు. అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి చేసిన వ్యాఖ్యలైతే దారుణాతి దారుణం. ఇంకా అనేక రకాలుగా ప్రతిపక్ష నేతలను వైసీపీ నేతలు అనరాని మాటలు అన్నారు. సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, బియ్యపు మధుసూదన రెడ్డి లాంటి వాళ్లు చంద్రబాబు, టీడీపీ నేతల గురించి ఎంత దారుణంగా మాట్లాడారో తెలిసిందే.
తమ పార్టీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటే జగన్ వెకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని ఎంజాయ్ చేయడాన్ని టీడీపీ వాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు. అలాగే అసెంబ్లీ బయట పవన్ కళ్యాణ్ గురించి వైసీసీ వాళ్లు చేసిన ఎగతాళి అంతా ఇంతా కాదు. ఇప్పుడు టీడీపీ, జనసేన టైం వచ్చింది. వైసీపీ వాళ్ల స్థాయిలో కాకపోయినా జగన్‌ను ఆ పార్టీల నేతలు టార్గెట్ చేయడం ఖాయం.
ఈ నేపథ్యంలో కేవలం పది మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలో అడుగు పెట్టే జగన్‌కు ఎదురయ్యే అనుభవాలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు పవన్‌కు తోడు వైసీపీ హయాంలో అరెస్ట్ చేసి దారుణంగా హింసించిన రఘురామకృష్ణంరాజు సైతం అసెంబ్లీలో ఉంటారు. వీళ్లకు ఎదురు పడాలి. ఎదుర్కోవాలి. అదే సమయంలో అధికార పార్టీ దాడిని ఫేస్ చేయాలి. ఇవన్నీ జగన్‌కు తీవ్ర ఇబ్బంది కలిగించే విషయాలే. ఎంతో అవమాన భారాన్ని దిగమింగుకుని అసెంబ్లీలో కొనసాగడం అంత కష్టం కాదు. ఈ నేపథ్యంలో జగన్ అసలు అసెంబ్లీకి వస్తాడా రాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీకి వెళ్లి ఈ అవమానాన్ని ఫేస్ చేయడం కంటే.. కొంచెం గ్యాప్ తీసుకుని జనంలోకి వెళ్లడానికే జగన్ ప్రయత్నిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates