31న చంద్ర‌బాబు-ప‌వ‌న్ భేటీ.. కీల‌క చ‌ర్చ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. ఈ నెల 31న భేటీ కానున్నారు. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో జ‌ర‌గ‌నున్న ఈ బేటీలో కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని ఇరు పార్టీల ముఖ్య నాయ‌కులు తెలిపారు. ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం ఈ నెల 13 త‌ర్వాత‌.. ఇరువురు నాయ‌కులు కూడా విదేశాల‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు అమెరికాకు వెళ్లిన‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న జారీ చేయ‌గా, ప‌వ‌న్ ఎక్క‌డికి వెళ్లిందీ మాత్రం తెలియ‌దు. మొత్తానికి చంద్ర‌బాబు తిరిగి వ‌చ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురువారం ఉద‌యం తిరిగి రానున్న‌ట్టు తెలిసింది.

ఈ క్ర‌మంలో ఈ నెల 31న ప‌వ‌న్ క‌ల్యాణ్‌… చంద్ర‌బాబుతో భేటీ కానున్నారు. 1వ తారీకు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు రాను న్నాయి అదేవిధంగా జూన్ 4న అస‌లు ఫ‌లితం రానుంది. దీంతో ఈ భేటీలో ఫ‌లితాల స‌ర‌ళిని.. అదేవిధంగా కౌంటింగ్ ప్ర‌క్రియకు సంబంధించిన ఏర్పాట్ల‌పైనా చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌లు చ‌ర్చించ‌నున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన బ‌రిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ ఏజెంట్ల ఎంపిక‌..వారికి శిక్ష‌ణ ఇచ్చే అంశాల‌ను కూడా చంద్ర‌బాబు చెప్ప‌నున్న‌ట్టు తెలుస్తోంది. కౌంటింగ్ స‌మ‌యంలో వైసీపీ ఏదైనా దొడ్డిదారి వ్యూహం అవ‌లంభిస్తే.. దానిని ఎదుర్కొనే అంశాల‌పైనా ఇరువురూ చ‌ర్చించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇదిలావుంటే.. ఈ భేటీలో కీల‌క‌మైన వ్య‌వ‌హారంపైనా ఇరువురు నాయ‌కులు దృష్టి పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. ఫ‌లితాల అనం త‌రం.. ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలి? అనుకూలంగా వ‌స్తే.. ఏం చేయాల‌ని.. లేక ఒక‌టి రెండు సీట్లు త‌గ్గినా.. ఎలాంటి వ్యూహంతో వెళ్లాల‌నే విష‌యాల‌పై కూడా.. ఇరువురు నాయ‌కులు చ‌ర్చించ‌నున్న‌ట్టు తూర్పుగోదావ‌రికి చెందిన కీల‌క నాయ‌కు డు ఒక‌రు చెప్పారు. “పార్టీ ప‌రంగా మేం న‌మ్మ‌కంగా ఉన్నాం. కూట‌మి ప‌రంగా కూడా విశ్వాసంతోనే ఉన్నాం. అయితే.. ఏదైనా తేడా వ‌చ్చినా.. అధిగ‌మించేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాల‌నే విష‌యంపై కూడా.. దూర‌దృష్టితో ఆలోచిస్తున్నాం ” అని గ‌తంలో కీల‌క మంత్రిగా కూడా చేసిన ఆయ‌న తాజాగా వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ నెల 31న జ‌ర‌గ‌నున్న భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింద‌ని పార్టీ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి.