కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. జ‌గ‌న్ ప‌రిస్థితేంటి?

ఓడ‌లు బ‌ళ్లు కావొచ్చు.. బ‌ళ్లు ఓడ‌లు కూడా కావొచ్చు. కాబ‌ట్టి ప్ర‌జాస్వామ్యంలో ఏమైనా జ‌ర‌గొచ్చు. అలానే కేంద్రంలో రేపు మోడీ స్థానంలో కాంగ్రెస్ రాకూడ‌ద‌ని ఏమీ లేదు. ఇంత‌క‌న్నా ఎక్కువ‌గానే త‌మ పాల‌న బాగుంద‌ని ప్ర‌చారం చేసుకున్న స‌మ‌యంలోనే బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. 2004 కు ముందు. అప్పటి ప్ర‌ధాని వాజ‌పేయి.. ఉప ప్ర‌ధాని ఎల్ కే అద్వానీలు దేశ‌వ్యాప్తంగా తిరిగి ప్ర‌చారం చేసుకున్నారు. దేశం వెలిగిపోతోంద‌ని  కూడా అన్నారు.

ఇంకేముంది.. వాజ‌పేయిని చూసి ద‌క్షిణాదిలోను.. అద్వానీని చూసి ఉత్త‌రాది వారు ఓట్లేస్తార‌ని లెక్క‌లు వేసుకున్నారు. కానీ, 2004లో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఊహించ‌ని విధంగా కాంగ్రెస్ అధికారం లోకి వ‌చ్చింది. ఇప్పుడు మాత్రం ఆ ఫార్ములా రాకూడ‌ద‌ని ఏమీ లేదు. ప్ర‌జానాడిని పూర్తిస్థాయిలో అంచనా వేయ‌డం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ సాధ్యం కాలేదు. సో.. దేశంలో ఏమైనా జొర‌గొచ్చు.

ఇలా చూసుకుంటే.. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింద‌ని అనుకుంటే… ఏపీలో జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. ఇక్క‌డ వైసీపీ వ‌చ్చినా రాకున్నా.. జ‌గ‌న్ ను కాంగ్రెస్ వెంటాడుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాష్ట్రంలో విభ‌జ‌న త‌ర్వాత‌. కాంగ్రెస్ కొంత వ‌ర‌కు న‌ష్ట‌పోతే.. జ‌గ‌న్ సొంత‌గా పార్టీ పెట్టుకున్న‌ద‌రిమిలా.. అస‌లు కాంగ్రెస్‌కు నామ‌రూపాలు లేకుండా చేశార‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ జ‌గ‌న్‌ను మాత్ర‌మే టార్గెట్ చేసుకుంది.

తాజాగా ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలోనూ విప‌క్షాల కంటే కూడా. సీఎం జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకుంది. రేపు కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే.. మ‌రింత‌గా జ‌గ‌న్‌కు ఉచ్చు బిగుసుకోవ‌డం ఖాయ‌మని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న‌పై న‌మోదైన అక్ర‌మాస్తుల కేసుల‌ను మ‌రింత వేగంగా ముందుకు తీసుకువెళ్ల‌డంతోపాటు.. గ‌తంలో క‌నిమొళి వ్య‌వ‌హారంలో వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని కూడా లెక్క‌లు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే.. సీఎం జ‌గ‌న్ మ‌రోసారి మోడీ వ‌చ్చినా ఇబ్బంది లేద‌ని.. కాంగ్రెస్ మాత్రం రాకూడ‌ద‌ని చెప్పుకొచ్చారు.