దర్శి యమ కాస్ట్ లీ గురూ !

అక్కడ 2.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏకంగా 2.6 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 90.91 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రమంతా 82 శాతం ఓటింగ్ జరిగితే అక్కడ దానిని మించిపోయింది. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చు ఏకంగా రూ.200 కోట్లు అన్న ప్రచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రకాశం జిల్లా దర్శి ఇప్పుడు ఏపీ ఎన్నికలలో హాట్ టాపిక్ గా మారింది.

దర్శి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశాడు. 2004లో ఆయన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించాడు. 2009లో శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ తరపున విజయం సాధించాడు. 2014లో టీడీపీ అభ్యర్థి చేతిలో 1374 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు. ఈసారి తిరిగి వైసీపీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.

టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తుండగా ఆమె తండ్రి గొట్టిపాటి నర్సయ్య గతంలో మార్టూరు ఎమ్మెల్యేగా గెలిచాడు. లక్ష్మి తొలిసారి ఎన్నికలలో పోటీకి దిగింది. ఇద్దరు అభ్యర్థులు డాక్టర్లే కావడంతో ఎన్నికల్లో మనీ ఏరులై పారింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఓటుకు రూ.5 వేలు ఇచ్చారని తెలుస్తుంది.

ఇక పోలింగ్ కు ముందు ఓటుకు రూ.2 వేల చొప్పున టీడీపీ అభ్యర్థి ఇవ్వగా, వైసీపీ అభ్యర్థి ఓ అడుగు ముందుకువేసి ఓటుకు రూ.3 వేలు ఇచ్చినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకుని టీడీపీ అభ్యర్థి ఓటుకు రూ.1000 మరో సారి ఇవ్వగా, వైసీపీ అభ్యర్థి ఓటుకు రూ.500 ఇచ్చినట్లు సమాచారం. ఇక నియోజకవర్గంలో నాయకుడి స్థాయిని బట్టి రూ.10 వేల నుండి పాతిక లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తుంది.

ఒక వర్గం వారు ఆంధ్రాలోని మద్యం ఓటర్లకు అందించగా, మరో వర్గం తెలంగాణ నుండి రెండు కంటెయినర్లలో మద్యం తెచ్చి పంపిణీ చేశారట. ఇక ఇంటింటికి మూడు సార్లు మటన్, చికెన్ తో పాటు, మహిళలకు చీరలు, కుక్కర్లు, పురుషులకు పంచెలు అందించినట్లు సమాచారం.

పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికలలో ఎవరికి వారు ఆరు నుండి ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని చెబుతున్నారు. రోగి నాడి పట్టిన డాక్టర్లలో ఓటరు నాడి ఎవరు పట్టారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. దర్శి నియోజకవర్గంలో అయిన ఖర్చు చూసి ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు ముక్కు మీద వేలేసుకుంటున్నారట.