రాజకీయాలు ఎలాగైనా మారొచ్చు. ఊహించిందంతా జరగాలని లేదు. గతమైనా.. వర్తమానమైనా.. నాయకులకు పరీక్షే! అప్పుడు పూలమ్మాం.. కాబట్టి ఎప్పటికీ పూలే అమ్ముతాం.. అనే పరిస్థితి రాజకీయాల్లో ఉండదు. తిరుగులేని నియోజకవర్గంలోనే రాహుల్‌గాంధీ గత ఏడాది ఓడిపోయారు. గుడ్డిలో మెల్లగా.. ముందుగా ఊహించుకుని వయనాడ్‌కు మారిపోయాడు కాబట్టి కనీసం పార్లమెంటులో అడుగులు వేసే పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. రాజకీయాల్లో అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పడానికే.
ఇక, గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ రెండు చోట్ల పోటి చేసిన అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి.. కూడా ఇరు చోట్ల ఓడిపోయారు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే తరహా పరిస్థితి ఉండదు. పరిస్థితికి అనుగుణంగానే నాయకులు వ్యవహరించాల్సి ఉంటుంది. ఏపీ విషయానికి వస్తే.. ఈ నెల 13న జరిగిన ఎన్నికలపై అధికార పార్టీ వైసీపీకి ధీమా ఉండి ఉండొచ్చు. 151 కాదు.. ఇంకా ఎక్కువగానే స్థానాలు దక్కించుకుంటామనే ధీమా కూడా ఉండి ఉండొచ్చు. కానీ, ఓటరు దేవుడి కరుణ ఎలా ఉందో తెలియదు. ఈవీఎంలు మౌనంగా ఉన్నాయి.
జూన్ 4వ తేదీనే ఈవీఎంలలో ఉన్న రహస్యం బయటపడనుంది. ఒకవేళ.. ఆ ఫలితం చేదుగా ఉంటే ఏంజరుగుతుంది? రేపు వైసీపీ అధికారంలోకి రాకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అనేది కూడా నాణేనికి రెండో వైపు ఉన్న అంశం. ప్రస్తుత సీఎం జగన్ గెలవొచ్చు. కానీ.. పార్టీ ఓడిపోయి.. అదికారం నుంచి దిగిపోతే.. ఆయన పరిస్థితి ఏంటి? అసెంబ్లీ మారదు.. ప్రతిపక్ష నాయకుడు కూడా మారడు. ఎటొచ్చీ.. అధికారమే మారిపోతుంది. ఎటొచ్చీ.. తన వ్యూహమే వికటిస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు? ఓటమిని జీర్ణించుకుంటారా? లేక.. ఏం చేస్తారు? అనేది చర్చ.
అంతేకాదు.. అసలు ఓటింగ్ ఫలితం వచ్చిన తర్వాత.. వ్యతిరేక తీర్పు వస్తే.. అసెంబ్లీకి జగన్ వెళ్తారా? వెళ్లరా? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. అధికారంపై ఆయన ఎంతో ధీమాగా ఉన్నారు. పైగా ఏకఛత్రాదిపత్యంగా గత ఐదేళ్లలో 151 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీని ఏలారు. అలాంటి చోట.. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే.. అధికార పక్షం నుంచి ఎదురయ్యే సూటి పోటి మాటలు భరించాల్సి వస్తే.. జగన్ ఏం చేస్తారు? దీనికి రెండే సమాధానాలు వస్తున్నాయి. ఒకటి.. మౌనంగా ఉండడం.. లేదా రెండు.. అసలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఉండడం.
ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఆయన ఎంచుకునే అవకాశం ఉంది. తనకు బదులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లేదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సీఎల్‌పీలో ప్రతిపక్ష నేతను చేసే అవకాశం కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు. 2017లో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే.. మూడేళ్లపాటు ఆయన సభను బహిష్కరించి.. సంకల్ప యాత్ర చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే బాట పడతారా? అనేది చూడాలి.