నోరు జారిన కేటీఆర్‌.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఈసీ ఆదేశం!

తెలంగాణ ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని వారాల కింద‌ట క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. కీల‌క‌మైన ఎన్నిక‌ల పోలింగ్‌కు వారం ముందు ఆయ‌న‌ను 48 గంట‌ల పాటు ప్ర‌చారంలో పాల్గొన‌కుండా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం అడ్డుకుంది. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్ స‌హా కాంగ్రెస్ నేత‌ల‌పై కేసీఆర్ నోరు చేసుకోవ‌డ‌మే. దీనిపై వివ‌ర‌ణ కోరిన ఎన్నిక‌ల సంఘం.. ఆ వివ‌ర‌ణ‌తో సంతృప్తి చెంద‌లేదు. దీంతో 48 గంట‌ల పాటు ఆయ‌న‌ను ప్ర‌చారం నుంచి స‌స్పెండ్ చేసింది.

ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. కేసీఆర్ త‌న‌యుడు, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనా కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌న్నెర్ర చేసింది. ఆయ‌న‌పైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్ రాజ్‌ను ఆదేశించింది. దీంతో కేటీఆర్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది చూడాలి. ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఈ విష‌యం ఆస‌క్తిగా మారింది. నిన్న తండ్రి నేడు కొడుకు.. అడ్డంగా బుక్క‌య్యారంటూ.. అధికార ప‌క్షం నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అస‌లు ఏం జ‌రిగింది?

ఈ నెల 13న తెలంగాణ‌లో నాలుగో ద‌శ పోలింగ్ లో భాగంగా 17 పార్ల‌మెంటుస్థానాల‌కు ఎన్నికల పోలింగ్ జ‌రిగింది. ఆరోజు.. త‌న ఓటు భ‌క్కు వినియోగించుకున్న మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు కేటీఆర్‌.. పోలింగ్ బూత్ వెలుప‌ల మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాను ఏ పార్టీకి, ఏ అభ్య‌ర్థికి ఓటు వేసిందీ.. ప‌రోక్షంగా అర్ధ‌మ‌య్యేలా చెప్పేసి.. నోరు జారారు. నిజానికి ఓటు వేసిన త‌ర్వాత‌.. ఎవ‌రూ తాము ఎవ‌రికిఓటేసిందీ చెప్ప‌డానికి వీల్లేదు. ఇది కామ‌న్ రూల్‌. అయితే.. కేటీఆర్ తెలిసి కూడా ఈ విష‌యాన్ని విస్మ‌రించారు.

తాను ఏ నాయ‌కుడికి ఓటు వేసిందీ.. మీడియా ముందు ప‌రోక్షంగా చెప్పేశారు. దీనిపై అప్ప‌ట్లోనే తీవ్ర దుమారం రేగింది. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న కాంగ్రెస్ నాయ‌కులు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌.. ఈ ఫిర్యాదును కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించారు. త‌ర్వాత‌.. కేటీఆర్ వివ‌ర‌ణ కోరుతూ.. నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15 లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేటీఆర్‌ను ఈసీ ఆదేశించింది. కానీ, ఆయ‌న లైట్ తీసుకున్నారు. మ‌రోసారి దీనిపై దృష్టి పెట్టిన ఈసీ.. వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని తీవ్రంగా భావించింది. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశిస్తూ వికాస్ రాజ్‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.