ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు వేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా ఆయా జిల్లాల‌కు కొత్త అదికారుల‌ను నియ‌మించింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్ రెడ్డి పంపించిన పేర్ల నుంచి వారిని ఎంపిక చేసి.. తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని ప్ర‌కారం.. ప‌ల్నాడు జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న లోతోటి శివ‌శంక‌ర్‌ను బ‌దిలీ చేసిన ఎన్నిక‌ల సంఘం కొత్త క‌లెక్ట‌ర్ శ్రీకేష్ బాలాజీని నియ‌మించింది.

అదేవిధంగా ప‌ల్నాడు ఎస్పీగా ఉన్న బిందు మాధ‌వ్‌ను స‌స్పెండ్ చేసి.. ఈ స్థానంలో మ‌ల్లికా గార్గ్‌ను నియ‌మించింది. అలాగే తిరుపతి జిల్లా ఎస్పీగా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని ఎన్నిక‌ల సంఘం ఎంపిక చేసింది. వీరిని త‌క్ష‌ణ‌మే ఆయా పోస్టుల్లో చేరాల‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఆదివారం ఉద‌యానికి త‌మ‌కు మ‌ళ్లీ నివేదిక పంపించాల‌ని కోరింది. ఇదిలా వుంటే.. ప‌ల్నాడులో చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై ఇప్ప‌టికే వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది అధికారుల‌తో కూడిన ఉన్న‌త‌స్థాయి ప్ర‌త్యేక‌ద‌ర్యాప్తు బృందాన్ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన విష‌యం తెలిసిందే.

ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఇప్ప‌టికే ప‌ని ప్రారంభించింది. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి.. వాస్త‌వాలు వెలికితీయ‌డంతోపాటు.. ఘ‌ట‌న ల‌ను ఎందుకు అడ్డుకోలేక పోయారు..? దీనివెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? వంటి కీల‌క అంశాల‌పై దృష్టి పెట్టింది. ఇప్ప‌టికే ప్రాథ‌మిక ద‌ర్యాప్తును కూడా ఈ బృందం పూర్తి చేసి.. క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితిని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నివేదిక రూపంలో అందించింది. మ‌రో రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక‌ను ఈ సిట్ అందించ‌నుంది. మ‌రోవైపు.. దాడికి కార‌ణ‌మైన కొంద‌రు రాజ‌కీయ పార్టీల నాయ‌కులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో వారి వివ‌రాల‌ను కూడా రాబ‌డుతున్నారు.